కాలుష్యరహితంగా దీపావళి...

SMTV Desk 2017-10-20 11:41:32  supreme courtban on crackers, Diwali, Delhi

న్యూఢిల్లీ, అక్టోబర్ 20 : దీపావళి పండుగ రోజున టపాసుల నిషేధంపై సుప్రీంకోర్టు హెచ్చరికల ప్రభావం పెద్దగా కనిపించలేదు. ఢిల్లీలో కాలుష్యం ప్రమాదకర రెడ్‌ జోన్‌కు చేరినట్టు కాలుష్య పర్యవేక్షణ కేంద్రాల్లోని ఆన్‌లైన్‌ ఇండికేటర్స్‌ వెల్లడించాయి. వాయు నాణ్యత కూడా గణనీయంగా పడిపోయింది. కాలుష్యరహితంగా దీపావళి పండుగ జరుపుకోవాలన్న దేశ రాజధాని ఢిల్లీ ఆశలు అడియాసలయ్యాయి. టపాసుల అమ్మకాలపై సుప్రీంకోర్టు నిషేధం విధించినా.. ఢిల్లీ, జాతీయ రాజధాని ప్రాంతం (ఎన్సీఆర్‌)లో కాలుష్య పోటు తప్పలేదు. ఎప్పటిలాగే హస్తిన వాసులు ఘనంగా దీపావళి పండుగ జరుపుకున్నారు. టపాసుల మోత మోగించారు. దీంతో కాలుష్యం పెరిగిపోయి.. వాతావరణంలో దట్టమైన పొగ అలుము కోవడంతో అక్కడి వాసులను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. రాత్రి ఏడు గంటల నుంచే అల్ట్రాఫైన్‌ పార్టిక్యూలేట్స్‌ ప్రమాదకర స్థాయికి పెరిగిపోయాయి. పీఎం2.5, పీఎం 10 స్థాయికి పెరిగిపోయిన ఈ కాలుష్య కణాలు మనిషి శ్వాస వ్యవస్థలోకి ప్రవేశించి, అనంతరం రక్త ప్రవాహంలో కలిసి ఆరోగ్యానికి తీవ్రమైన ఇబ్బంది కలిగిస్తాయి. ఈ మేరకు ఢిల్లీలో కాలుష్యం అత్యంత ప్రమాదకర స్థాయికి చేరిందని పొల్యూషన్‌ డాటా స్పష్టం చేస్తోంది.