పదహారు రోజులకు ముందే మృత్యువు పిలిచింది....

SMTV Desk 2017-10-18 17:30:33  guntur, kanparru dist, crime latest updates

గుంటూరు, అక్టోబర్ 18 : పసుపు పారాణి ఆరక ముందే...గొంతులో ప్రాణాలు ఆగి పోయాయి. పదహారు రోజుల పండుగ చేసుకోక ముందే ఒక నూతన వరుడు ప్రాణాలు పోగొట్టుకున్న హృదయ విదారకమైన ఘటన మంగళవారం గుంటూరు జిల్లాలోని కనపర్రులో జరిగింది. పోలీసులు, కుటుంబ సభ్యుల కథనం ప్రకారం....కనపర్రుకు చెందిన పల్లపు రాయన్న, ఇన్నేశమ్మ దంపతులకు నలుగురు సంతానం. వారిలో మూడో కుమారుడు మహేంద్ర తాపీ మేస్త్రీ గా పనిచేస్తున్నాడు. అతనికి ఈ నెల 4న, అదే ఊరు లోని శ్రీ విద్యతో వివాహ౦ జరిగింది. పదహారు రోజుల పండుగ వరకు బయటకు వెళ్లకూడదని వరుడు నిర్ణయించుకున్నాడు. కానీ ఓ నివాస గృహ ప్లాస్టరింగ్ పనులు పరిశీలించేందుకు అన్న మరియా రాజు, తన తోటి కార్మికుడు గుంజి మరియా రాజుతో కలిసి బయలుదేరాడు. ఇంట్లో వారు వెళ్లవద్దని వాదించిన వినకుండా బయటకు వెళ్ళాడు. వీరు ముగ్గురు కొత్తగా కట్టిన ఇంటి మేడ పైకి వెళ్లి చూసి క్రిందకు వచ్చారు. బయటి గోడలు చూసోస్తానని మహేంద్ర ఒక్కడే మళ్లీ పైకి వెళ్ళాడు. అప్పుడు ఇంటి పైగా వెళ్తున్న 11 కీవీ విద్యుత్ తీగలు మొదట గమనించినా తరువాత మరిచిపోయి తల తిప్పడంతో ఒక విద్యుత్ తీగ తగిలి బలంగా లాక్కొని నెలకు విసిరికొట్టింది. దాంతో అతను దిమ్మతిరిగి బోర్లపడ్డాడు. అయితే ఎంతసేపటికి అతను రాకపోవడంతో క్రింద ఉన్న ఇద్దరు పైకి వెళ్లి చూసే సరికి పడి ఉండటంతో అతని గుండెలపై ఒత్తిడి చేశారు, అరికాళ్లు రుద్ది బ్రతికించేందుకు ప్రయత్నించారు. 108 వాహనంలో నరసరావుపేటలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అక్కడి వైద్యులు అప్పటికే మరణించాడని నిర్ధారణ చేశారు. భర్త శవాన్ని చూసిన ఆ నూతన వధువు సొమ్మసిల్లింది. అప్పటివరకు కళకళలాడుతున్న పెళ్లి ఇంటా విషాద ఛాయలు అలముకున్నాయి. యజమాని, విద్యుత్ శాఖ నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందని మృతుని బంధువులు ఆరోపిస్తున్నారు. సంఘటన స్థలాన్ని ఎస్సై చంద్రశేఖర్, విద్యుత్ శాఖ ఏఈ అనిల్ పరిశీలించి మృతుని సోదరుడు, గుంజి మరియా రాజు కథనం ప్రకారం నాదెండ్ల పోలీసులు కేసు నమోదు చేశారు.