ఆసుపత్రిలో ఆక్సిజన్ ప్రేలుడు...

SMTV Desk 2017-10-17 10:59:15  warangal, hanumakonda, rohini hospital

వరంగల్, అక్టోబర్ 17: ఒక్కసారిగా ఆసుపత్రిలో దట్టంగా పొగలు అలుముకున్నాయి. రోగులు అందరు భయాందోళనకు గురై పరుగులు తీశారు. హన్మకొండలోని సుబేదారీ ప్రాంతంలో రోహిణి ఆసుపత్రిలో సోమవారం సాయంత్రం విద్యుదాఘాతం ఘటనతో ఆక్సిజన్ సిలి౦డర్ నుంచి మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా, ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. వైద్యుల పోలీసుల కథనం ప్రకారం... రోహిణి ఆస్పత్రి రెండో అంతస్తులోని ఆపరేషన్‌ థియేటర్‌లో సోమవారం సాయంత్రం ఓ రోగికి న్యూరో శస్త్రచికిత్స చేస్తున్నారు. ఈ గదిలో విద్యుదాఘాతం జరిగి మంటలు లేచాయి. గుర్తించిన వైద్య సిబ్బంది రోగితో పాటు బయటకు వచ్చారు. పక్కనే ఉన్న ఆర్థో విభాగం థియేటర్‌లో కుమారస్వామి అనే రోగి కాలుకి శస్త్రచికిత్స జరుగుతుంది. కరెంటు నిలిచిపోవడంతో అక్కడి వైద్యులు కూడా బయటకు వచ్చి చూశారు. దట్టమైన పొగలు వ్యాపించడంతో పరుగులు తీశారు. తర్వాత రోగిని తీసుకొద్దామని ప్రయత్నించినా, తీసుకురాలేని పరిస్థితి ఏర్పడింది. పొగలు తగ్గాక లోపలకు వెళ్లి చూసే సరికి కుమారస్వామి విగతజీవిగా కనిపించాడు. ప్రమాద సమయంలో వైద్యుడు సంజయ్‌ ఒక రోగికి మెదడుకు సంబంధించి శస్త్రచికిత్స పూర్తి చేశారు. అంతలో పక్కనే ఉన్న ఆపరేషన్‌ థియేటర్లో అగ్ని ప్రమాదం సంభవించడంతో తీవ్రతను ఊహించి, ఆయన ఆపరేషన్‌ చేసిన రోగిని సిబ్బంది సహకారంతో కిందకు తీసుకొచ్చి కాపాడారు. ఇలా సుమారు 15 మంది ప్రాణాలు కాపాడటంలో కీలకంగా వ్యవహరించారు. సంఘటనా స్థలికి ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, పోలీసు కమిషనర్‌ సుధీర్‌బాబు, కలెక్టర్‌ ఆమ్రపాలి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షించారు. వైద్య ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి ఘటనపై ఆరాతీశారు.