అభివృద్ధి పనులపై జాప్యం ఎందుకు? : మంత్రి కేటీఆర్

SMTV Desk 2017-10-15 12:30:23  Minister KTR Review, Warangal, collector, warangal updates.

హైదరాబాద్, అక్టోబర్ 15 : వరంగల్ లో జరుగుతున్న అభివృద్ధి పనుల తీరుపై ఐటీ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పనులలో తీవ్ర జాప్యం నెలకొందని, అధికారులు అలసత్వం వీడి పనులలో వేగం పెంచాలంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వరంగల్ కలెక్టరేట్ లో సుమారు గంటకు పైగా జరిగిన ఈ సమీక్షలో ఎన్ని నిధులున్నా పనులలో ఎందుకు జాప్యం జరుగుతోందని కలెక్టర్, నగరపాలక కమీషనర్, ఇతర అధికారులను మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. స్మార్ట్ సిటీ పనులు ముందుకు సాగేది ఎప్పుడని, నగరంలో రెండు పడక గదుల నిర్మాణం ఎందుకు వేగంగా జరగడం లేదని అధికారులను మందలించారు. వెంటనే స్థలాలను గుర్తించి రెండు పడక గదుల నిర్మాణాలు చేపట్టాలని స్పష్టం చేశారు. ఏడాదిలోగా ఈ రెండు పడక గదుల నిర్మాణాన్ని పూర్తి చేయాలని ఆదేశించారు. సీఎం ఆదేశించినా పనులలో ఇంత జాప్యం చూపించినందుకు అధికారులపై మండిపడ్డారు. కార్పోరేషన్ నిధులు రూ. 300 కోట్లతో పాటు వివిధ పథకాల కింద వచ్చిన నిధులను అధికారులు ఖర్చు చేయడం లేదని, రూ. 300 కోట్లలో కేవలం రూ. 50 కోట్లను మాత్రమే ఖర్చు చేసారు ఇలా అయితే ఎలా అంటూ కేటీఆర్ ప్రశ్నించారు. ఒక నిర్దిష్ట సమయంలో పనులన్నీ పూర్తి చేసి వారాంతాల్లో పనుల పురోగతిని ఎప్పటికప్పుడు సమీక్షించుకోవాలని అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో వరంగల్ పట్టణ గ్రామీణ కలెక్టర్లు ఆమ్రపాలి, ప్రశాంత్ జీవన్ పాటిల్, నగర మేయర్ నరేందర్, పురపాలక కమీషనర్ శ్రుతి ఓజా పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.