వచ్చేసిన మృగశిర... భారీ ఏర్పాట్లతో నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్

SMTV Desk 2017-06-07 14:52:09  hyderabad nampally exhibition ground celebrating about mangasiri karthi

హైదరాబాద్, జూన్ 7 : మృగశిర కార్తి సందర్భంగా నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో గురువారం ప్రారంభంకానున్న చేప ప్రసాదం పంపిణీకి సర్వం సిద్దమైనట్లు, పశుసంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. మంగళవారం ఆయన నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో ఏర్పాట్ల ను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రసాదం పంపిణీ గురువారం ఉదయం 9 గంటల నుంచి మొదలై శుక్రవారం సాయంత్రం వరకు కొనసాగుతుందని తెలుపుతూ, మొత్తం 32 కౌంటర్ల ను ఏర్పాటు చేశామని వెల్లడించారు. గత 170 ఏండ్లుగా బత్తిన కుటుంబం పంపిణీ చేస్తున్న ఈ చేప ప్రసాదం స్వీకరించేందుకు తెలంగాణ ప్రజలతో పాటు దేశ విదేశాల నుంచి అనేకమంది వస్తుంటారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు అన్ని శాఖల సమన్వయంతో ప్రశాంతంగా చేప ప్రసాదం అందరికి పంపిణీ జరిగేల చర్యలు తీసుకుంటున్నట్లు తెలియజేశారు. దాదాపు 2 లక్షల చేప పిల్లలు అందుబాటులో ఉంచుతామని, ఈ ప్రసాద వితరణ పూర్తి అయ్యే వరకు ఎలాంటి అంతరాయం లేకుండా ప్రతి నాలుగు గంటలకు ఒకసారి పంపిణీ బృందాలు అందుబాటులోకి వస్తారన్నారు. ఈ కార్యక్రమానికి ప్రభుత్వంతోపాటు స్వచ్ఛంద సంస్థలు, దాతలు, ఉచితంగా ఆహారం, మజ్జీగ ఏర్పాటు చేసి దాంతో పాటుగా ప్రత్యేకంగా రెండు కౌంటర్లు ఏర్పరుస్తూ విజయడైయిరీ ఆవు నెయ్యిని అందుబాటులో ఉంచనున్నట్లు స్వష్టం చేశారు. అంచనా ప్రకారం ఏర్పాట్ల లో భాగంగా ప్రభుత్వం జీహెచ్ఎంసీ నుంచి 550 మంది సిబ్బంది, పొలీస్ శాఖ నుంచి ఎనిమిది మంది ఏసీపీలు, 23 మంది సీఐలు, 27 మంది ఎస్ఐలు సహా మొత్తం 948 మంది, రెవెన్యూశాఖ నుంచి 12 మంది తహసీల్దార్లతో సహా 75 మంది, ట్రాఫిక్ పోలీసులు 70 మంది, మత్స్యశాఖ నుంచి 500 మంది, ఆర్అండ్బీ నుంచి 250 మందిని కేటాయిస్తూ.. పోలీసులు ఉన్నతాధికారులు ఎటువంటి లోటుపాట్లు లేకుండా చూస్తామని, అవసరమైన వారందరికీ ఐడీ కార్డులు, పాసులు అందజేస్తామంటూ పలువురు కార్పోరేటర్లు సైతం స్వచ్ఛందంగా ముందుకొచ్చి తమ వంతు సహకారాన్ని అందిస్తామని మరుగుదొడ్లు, షెడ్లు ఏర్పాటుకు ఎగ్జిబిషన్ సొసైటీ సహకరిస్తున్నదన్నారు. బత్తిన హరినాథ్ గౌడ్, మూసీ ప్రక్షాళన బోర్డ్ చైర్మన్ ప్రేమ్ సింగ్ రాథోడ్, కార్పోరేటర్ మోహన్, ఎగ్జిబిషన్ సొసైటీ సెక్రెటరీ ఆదిత్య మార్గమ్, డీసీపీ జోయాల్ డేవిన్, ఏసీపీలు జైపాల్, రాఘవేంద్రరెడ్డి, మత్స్యశాఖ జేడీ లు శంకర్ రాథోడ్, సరళాదేవి, డీఎంసీ విజయలక్ష్మి, జలమండలి సీజీఎం ప్రభాకర్, జీఎం రఘు, ఆర్డీవో చంద్రకళ, ఆర్అండ్ బీ ఈఈ మునీందర్, డీఈ ఎలక్ట్రికల్ జ్ఞానేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.