మూడో T-20 వర్షార్పణం.. మ్యాచ్ నిర్వహణలో హెచ్‌సీఏ విఫలం ..

SMTV Desk 2017-10-14 10:56:28  INDIA, AUSTRALIA, T20 MATCH, UPDATES.

హైదరాబాద్ అక్టోబర్ 14 : భారత్ ఆసీస్ ల మధ్య జరగాల్సిన మూడో టీ20 మ్యాచ్ వర్షం కారణంగా రద్దవడంతో భాగ్యనగర క్రికెట్ అభిమానుల ఆశలు అవిరైపోయాయి. ఎంతో ఆనందంగా హైదరాబాద్‌లో తొలి అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌ చూసేందుకు వచ్చిన అభిమానులుకు నిరాశే ఎదురైంది. శుక్రవారం ఉప్పల్‌లో వర్షం పడకున్నా.. గురువారం రాత్రి కురిసిన కుంభవృష్టి దెబ్బకు అవుట్‌ ఫీల్డ్‌ చిత్తడిగా మారిపోయింది. దీంతో అంపైర్లు 8.15 గంటలకు మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నామని ప్రగల్భాలు పలికిన హెచ్‌సీఏ(హైదరాబాద్‌ క్రికెట్‌ సంఘం) అధికారులు ముఖ్యమైన మైదానం నిర్వహణను మాత్రం విస్మరించారన్న విమర్శలు వస్తున్నాయి. టీ 20 మ్యాచ్‌ రద్దు కావడంతో టికెట్లు కొన్నవారికి ఆ మొత్తాన్ని తిరిగి చెల్లిస్తామని హెచ్‌సీఏ ప్రకటించింది. త్వరలోనే తేదీ వివరాలు వెల్లడిస్తామని, టికెట్లను జాగ్రత్త చేసుకోవాలని కోరింది.