మూడో స్థానాన్ని సంపాదించిన ప్రవాసాంధ్ర అమ్మాయి

SMTV Desk 2017-06-07 13:33:57  Ongole,ISWEEP-2017,America,Florida,Till oil

ఒంగోలు, జూన్ 7 : అమెరికాలో తెలుగు బాలిక తన ప్రతిభతో మెరిసింది. 67 దేశాలకు చెందిన 4000 మందికి పైగా విద్యార్థులు పాల్గొన్న అంతర్జాతీయస్థాయి ఐస్వీప్‌-2017 పోటీలో మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకం సాధించింది. నువ్వుల నూనెలోని ఔషధ గుణాలపై ఆమె సమర్పించిన పత్రానికి ఈ ఘనత దక్కింది. ఒంగోలులో వైద్యుల కుటుంబానికి చెందిన గంజాం రఘుదీప్‌ అమెరికాలోని ఫ్లోరిడాలో వైద్యులుగా స్థిరపడ్డారు. ఆయన కుమార్తె మేఘన(17) ఓర్లాండో నగరంలోని లేక్‌ ఐక్లాండ్‌ పాఠశాలలో 12వ తరగతి చదువుతోంది. ఒంగోలు వచ్చిన సందర్భంగా మంగళవారం ఆమె తల్లితండ్రులు విలేకరుల సమావేశం ఏర్పాటుచేశారు. వారు తెలిపిన వివరాల ప్రకారం... మేఘన 2016లో ప్రాంతీయస్థాయిలో జరిగిన ‘నెల్సమ్‌ యింగ్‌’ ఎక్స్‌పోజన్‌లో సిద్ధాంతాంశం సమర్పించి ప్రథమ స్థానంలో నిలిచింది. అనంతరం ఫ్లోరిడాలో రాష్ట్రస్థాయి ప్రదర్శనకు, తర్వాత ఐస్వీప్‌-2017 పోటీకి అర్హత సాధించింది. విద్యార్థుల్లో విజ్ఞాన, పర్యావరణ జిజ్ఞాసను పెంపొందించేందుకు వివిధ దేశాల చిన్నారులకు ప్రదర్శన, సిద్ధాంత సమర్పణకు అవకాశం కల్పించే వేదిక ఐస్వీప్‌(ఇంటర్నేషనల్‌ సస్టెయినబుల్‌ వరల్డ్‌ ఎనర్జీ ఇంజినీరింగ్‌ అండ్‌ ఎన్విరాన్‌మెంట్ ప్రాజెక్టు). గత మే నెలలో టెక్సాస్‌ రాష్ట్రంలోని హ్యూస్టన్‌ నగరంలో ఈ ప్రదర్శన, పోటీ నిర్వహించారు. భారతదేశంలో అనేక వ్యాధుల నివారణకు, ఆరోగ్యానికి నువ్వుల నూనెను ఉపయోగిస్తారన్నది మేఘన పత్రం సారాంశం. అన్ని వేలమందిలో తన సిద్ధాంతంపై ప్రసంగించి, న్యాయనిర్ణేతల ప్రశ్నలకు చక్కటి సమాధానాలిచ్చి బహుమతి గెలుచుకుంది. వైద్యవృత్తిలో స్థిరపడాలన్నది లక్ష్యమని మేఘన చెప్పింది.