టీడీపీలో ముసలం

SMTV Desk 2017-06-07 12:16:32  Nellore,AP,CM Chandrababu,Population,

నెల్లూరు, జూన్ 7 : జిల్లాలో తెలుగుదేశం పార్టీకి కొన్ని సామాజిక వర్గాలు దూరమవుతున్నాయా అంటే నిజమేనని రాజకీయ వర్గాలు వెల్లడిస్తున్నాయి. కాపులను బీసీలో చేర్చాలన్న ప్రతిపాదనను బీసీలు తొలి నుంచి వ్యతిరేకిస్తున్నారు. మరోవైపు జిల్లా జనాభాలో ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు పెద్ద సంఖ్యలో ఉన్నా వారికి రాజకీయ ప్రాధాన్యం లేకపోవడంతో ఆ సామాజిక వర్గాల్లో తమకు తగిన భరోసా లేదన్న ఆవేదన వ్యక్తమవుతోంది. సీఎం చంద్రబాబు తొలి ఐదు సంతకాల్లో ఉద్యోగుల వయో పరిమితిని పెంచుతూ, 43 శాతం ఫిట్‌మెంట్‌తో పీఆర్సీ ప్రకటించినా ఆ ఆనందం ఉద్యోగుల్లో మూణ్నాళ్ల ముచ్చటే అయింది. అధికారులపై రాజకీయ పెత్తనం, పథకాల అమలులోనూ వారి జోక్యం, కింది స్థాయి ఉద్యోగులను అవినీతిపరులుగా చిత్రీకరించే సంఘటనలతో ఉద్యోగుల్లో కూడా క్రమేపీ అసంతృప్తి రేగుతోంది. మూడేళ్ల పాలనలో ప్రభుత్వం ఎన్నో పథకాలు అమలు చేసినా వాటిని పార్టీ నేతలు ప్రజల్లోకి తీసుకుపోలేకపోతున్నారు. జిల్లాలో సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, పొంగూరు నారాయణలు మంత్రులుగా వ్యవహరిస్తున్నా బిజీ బిజీ పర్యటనలతోనే సరి పెట్టుకుంటూ పార్టీకి దూరమవుతున్న సామాజిక వర్గాలను దగ్గరకు చేర్చుకునే ప్రయత్నాలు చేపట్టడం లేదన్న చర్చ ఆ పార్టీలో సాగుతోంది. టీడీపీకి బీసీలే ఓటు బ్యాంకు : టీడీపీ ప్రభుత్వంలో ఎప్పుడూ బీసీలకు పెద్ద పీట వేసేవారు. ఎన్టీ రామారావు పాలన బీసీలకు స్వర్ణ యుగమనే చెప్పవచ్చు. అందుకనే బీసీ ఓటు బ్యాంకుతోనే టీడీపీ గెలుపు సాధిస్తుందన్నది మొదటి నుంచి వినిపిస్తోంది. జిల్లాలో బీసీ సామాజిక వర్గానికి చెందిన ఓటర్లు 30 నుంచి 40 శాతం వరకు ఉన్నట్లు సమాచారం. టీడీపీ మేనిఫెస్టోలో కాపులను బీసీలో చేరుస్తామని వెల్లడించడంపై బీసీలలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఇటీవల బీసీ కమిషన్‌ చైర్మన్‌ మంజునాథ్‌ జిల్లా పర్యటనకు వచ్చినప్పుడు ఓ వైపు బీసీలు, మరో వైపు కాపులు పోటీపడి వినతి పత్రాలు ఇచ్చారు. ఆందోళనలు, వివాదాలకు దిగారు. అప్పట్లో ఎన్టీఆర్‌ బీసీల్లో రాజకీయ చైతన్యం రగిలించి వారికి ఎన్నో పదవులు కట్టబెట్టిన సందర్భాలు ఉన్నాయి. అయితే ప్రస్తుతం జిల్లాలో ‘బీద’ సోదరులు మాత్రమే బీసీలన్నట్టు వారికే ప్రాధాన్యత ఇస్తూ మిగిలిన వారిని విస్మరిస్తున్నారన్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఈ మూడేళ్ల ప్రస్థానంలో పదవుల పందేరం పరిశీలిస్తే బీసీలకు సముచిత స్థానం దక్కలేదన్నది ఆ వర్గాల ఆవేదన. జిల్లాలో రెడ్డి సామాజిక వర్గం బలంగా ఉన్నా ఓటు బ్యాంకు మాత్రం బీసీలదే అన్నది వాస్తవం. అందుకనే బీసీలకు ప్రాధాన్యత ఇచ్చి దూరమవుతున్న ఆ సామాజిక వర్గాన్ని పార్టీకి దగ్గర చేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఇక కాపు సామాజిక వర్గం బీసీలుగా గుర్తించారని జరుగుతున్న ఆందోళనలకు జిల్లాలో కూడా ఆ సామాజిక వర్గం మద్దతు ఇస్తూ వస్తోంది. కాపు కార్పొరేషన్‌ ద్వారా రుణాలు అందిస్తామని చెప్పడంతో 13వేల మందికి పైగా కాపు యువత దరఖాస్తులు చేయగా, కేవలం 300 మందికే రెండేళ్లలో రుణాలు అందించడం కూడా కాపు యువతలో కొంత అసంతృప్తి నెలకొంది. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు పార్టీకి దూరం: ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు మొదటి నుంచి టీడీపీ నేతలను నమ్మరన్న అభద్రత కొనసాగుతూ వస్తోంది. నెల్లూరు నగరం, ఉదయగిరి, ఆత్మకూరు, కోవూరు, కావలి నియోజకవర్గాలలో ముస్లింలు గెలుపును ప్రభావితం చేసే పరిస్థితిలో ఉన్నారు. మొదటి నుంచి టీడీపీలో ముస్లిం సామాజిక వర్గానికి అంతగా ప్రాధాన్యత లేదన్నది ఆ వర్గాలు అంతర్గతంగా చర్చించుకుంటూ వస్తున్నారు. ఇటీవల నెల్లూరు నగరంలో కార్పొరేషన్‌ మేయర్‌గా ఎన్నికైన అబ్దుల్‌ అజీజ్‌ను టీడీపీలోకి చేర్చుకుని ఆ సామాజిక వర్గ ఓటర్లతో పార్టీని బలోపేతం చేసే దిశగా చేస్తున్న ప్రయత్నాలు పెద్దగా ఫలించడం లేదు. అజీజ్‌ వ్యవహార శైలిని ఆ సామాజిక వర్గ ఓటర్లే వ్యతిరేకిస్తూ బహిరంగంగా విమర్శలు గుప్పిస్తున్న సందర్భాలు ఉన్నాయి. ఆదాల ప్రభాకర్‌రెడ్డి అనుచరుడుగా ఉన్న ఖాజావలికి నుడా సభ్యుడుగా అవకాశం ఇవ్వడం తప్ప మరే విధమైన నామినేటెడ్‌ పదవులు ముస్లింలకు దక్కలేదన్నది వాస్తవం. ఎన్టీఆర్‌ నుంచి టీడీపీతోనే తమ జీవనం అన్న రీతిలో గిరిజనులు (యానాది) వ్యవహరించేవారు. క్రమేణ ఈ సామాజిక వర్గంలో కొందరు క్రిష్టియన్లుగా మారడంతోపాటు గిరిజనులకు టీడీపీలో తగు ప్రాధాన్యత ఇవ్వకపోవడంతో ఆ సామాజిక వర్గం మెల్లమెల్లగా టీడీపీకి దూరమవుతోంది. ఎస్సీల వర్గీకరణ కూడా టీడీపీకి తలనొప్పిగా మారింది. ఎస్సీలు మొదటి నుంచి టీడీపీతో అంటీముట్టనట్లుగా వ్యవహరిస్తూ వచ్చినా రిజర్వేషన్‌ పుణ్యమా అని ఎమ్మెల్యేలైన సందర్భాలు ఉన్నాయి. ప్రస్తుతం పరసారత్నం, నెలవల సుబ్రహ్మణ్యం, బల్లి దుర్గాప్రసాద్‌, గూడూరు ఎమ్మెల్యే పాశం సునీల్‌కుమార్‌ వంటి వారే ఎస్సీ సామాజిక వర్గం నుంచి పార్టీలో ముఖ్య నేతలుగా వ్యవహరిస్తున్నారు. బీజేపీతో పొత్తు వల్ల కూడా ఈ సామాజిక వర్గాలు టీడీపీకి దూరంగా ఉంటున్నాయన్నది స నేతల పనితీరు మారాలి: ఇప్పటికి మూడేళ్లు గడిచిపోయింది. మరో ఏడాది తరువాత ఎన్నికలకు వెళ్లాల్సిన తరుణంలో టీడీపీ కొన్ని సామాజిక వర్గాలను దూరం చేసుకోవడంతో పార్టీ ఓటు బ్యాంకు గల్లంతయ్యే ప్రమాదం ఏర్పడింది. అందుకే రానున్న కాలంలో అన్ని సామాజిక వర్గాలను కలుపుకుని పోయేలా మంత్రులు సోమిరెడ్డి, పొంగూరు నడవాల్సి ఉంది. ప్రస్తుతం పర్యటనలకే పరిమితమవుతున్న మంత్రులు దూరమవుతున్న సామాజిక వర్గాలను చేరదీసి మేమున్నామన్న భరోసా కల్పించాల్సి ఉంది. ప్రతిపక్షం బలహీనంగా ఉండడం అదే తమకు కలిసి వచ్చే అంశమని టీడీపీ నేతలు సంబరపడుతూ రేపటి ఎన్నికల్లో గెలుపు గుర్రాలతోనే ఎన్నికలనే ఆలోచనతో ఉన్నారు. ఆర్ధిక బలంతో గెలుపు సాధిస్తామని ధీమా వ్యక్తమవుతున్నా సంప్రదాయ ఓటు బ్యాంకుగా ఉన్న ఈ సామాజిక వర్గాల మద్దతు ఉంటే తప్ప గెలుపు సాధ్యం కాదన్నది గుర్తించుకుని నేతలు ఎంతో జాగ్రత్తగా వ్యవహరించాలని పార్టీ కేడర్‌ కోరుతోంది.