ఫిఫా అండర్ -17 టోర్నీలో ఓడిన భారత్...

SMTV Desk 2017-10-10 16:20:36  FiFA Under-17 World Cup, INDIA, COLAMBIA

న్యూఢిల్లీ, అక్టోబర్ 10 : అద్భుతం.. ప్రతి ఇండియన్ ఫుట్ బాల్ అభిమాని సగర్వంగా ఆనందపడ్డ క్షణం నిన్న జరిగిన ఫిఫా అండర్ -17 ప్రపంచ కప్ లో చోటుచేసుకుంది. మణిపూర్ కి చెందిన డిఫెన్సివ్‌ మిడ్‌ ఫీల్డర్‌ జిక్సన్ ‌సింగ్‌ 82వ నిముషంలో కార్నర్‌ కిక్‌ను తన అద్భుత హెడర్‌తో గోల్ చేశాడు. ఫిఫా టోర్నీలో భారత్ తరపున మొదటి గోల్ చేసిన వ్యక్తిగా జిక్సన్ రికార్డ్ నెలకొల్పాడు. మొదటి మ్యాచ్ లో అమెరికాతో పోరాడి ఓడినప్పటికీ, అలరించిన భారత్.. రెండో మ్యాచ్ లో కొలంబియాతో ఆడిన ఆట న భూతో.. న భవిష్యత్... అన్నట్టుగా ఉందని క్రీడ అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మొత్తంగా చూసుకుంటే హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్ ప్రథమార్ధంలో భారత్ వెనకబడ్డా, ఆ తరువాత రాకెట్ లా దూసుకెళ్లింది. శారీరకంగా, మానసికంగా, సాంకేతికంగా, కొలంబియా జట్టు భారత జట్టు కంటే బలమైనది. కొలంబియా తరపున జువాన్‌ పెనలోజా రెండు గోల్స్ చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఇతర మ్యాచ్‌ల్లో అమెరికా 1-0తో ఘనాపై, మాలి 3-0తో టర్కీపై, పరాగ్వే 4-2తో న్యూజిలాండ్‌పై నెగ్గాయి. భారత్‌ గురువారం చివరి లీగ్‌ మ్యాచ్‌లో ఘనాను ఢీ కొట్టనుంది.