జంతువులు డబ్బులను కూడా తింటాయా?

SMTV Desk 2017-06-07 11:43:22  Uttarpradesh,60 thousand rupees, Kannoj distirct,Hungry

కాన్పూర్, జూన్ 7 ‌: సాధారణంగా మనుషులకు ఆకలి వేస్తే అన్నం, టిఫిన్ తింటారు. అదేవిధంగా జంతువులు కూడా ఆకలి వేస్తే తవుడు, గడ్డి, మొక్కలు తినడం గమనిస్తుంటాం. కాని ఒక మేక మాత్రం ఆకలికి తట్టుకోలేక యజమానికి చెందిన రూ.60 వేల నోట్ల కట్టలను నమిలేసిన ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లో సంభవించింది. కన్నౌజ్‌ జిల్లాకి చెందిన సర్వేశ్‌ కుమార్‌ అనే వ్యక్తి ఇళ్ళను నిర్మించే వ్యాపారం చేస్తుంటాడు. ఇతను ఓ మేకని పెంచుకుంటున్నాడు. సోమవారం సర్వేశ్‌ ఇటుకలు కొనుగోలు చేయడానికి రూ.60 వేలు చొక్కా జేబులో పెట్టి స్నానానికి వెళ్లాడు. స్నానం చేసి వచ్చేసరికి మేక నోట్లు నమలడం గమనించాడు. అవి అతను దాచుకున్న రూ. 60వేల నోట్లని తెలిసి నిర్ఘాంతపోయాడు. ఆఖరికి అతని వద్ద కేవలం రూ.2 వేలు నోటు మాత్రమే మిగిలింది. అది కూడా సగం చిరిగిపోయింది. ఇంత జరిగినా మేకపై తనకు ఎలాంటి కోపం లేదని అదంటే తనకు ప్రాణమని చెప్తున్నాడు సర్వేశ్‌. ఈ విషయం తెలిసి చుట్టుపక్కల వారంతా సర్వేశ్‌ పెంచుకుంటున్న మేకను చూడ్డానికి తండోపతండాలుగా వస్తున్నారట. దాంతో సెల్ఫీలు కూడా దిగుతున్నారని సర్వేశ్‌ పేర్కొన్నాడు.