జమిలి ఎన్నికలు జరగాలి...ఈసీ అభిప్రాయం

SMTV Desk 2017-10-09 14:38:35  Jamil Elections, EC opinion, Election Commissioner OP Rawat

న్యూఢిల్లీ, అక్టోబర్ 09 : జమిలి ఎన్నికల నిర్వహణకు ఈసీ అనుకూలమేనని పునరుద్ఘాటిస్తూ ఎన్నికల కమిషనర్ ఒ.పి.రావత్‌ ఆదివారం పీటీఐ వార్తాసంస్ధకు తెలిపారు. లోక్ సభతో పాటు దేశంలోని అన్ని రాష్ట్రాల శాసనసభలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలంటే రాజకీయ పక్షాలన్నీ ఏకాభిప్రాయానికి రావాల్సిన అవసరం ఉందని కేంద్ర ఎన్నికల సంఘం పేర్కొంది. తరచూ ఎన్నికల నియమావళి అమలు చేయాల్సి రావడం వల్ల కలిగే అవాంతరాలను తప్పించుకునేలా జమిలి ఎన్నికలు జరగాలనేది ఎప్పటి నుంచో ఈసీ అభిప్రాయం. అలా జరిగితే ప్రభుత్వాలు తమ విధానాలను రూపొందించుకునేందుకు, కార్యక్రమాలను అమలు చేసేందుకు ఎక్కువ సమయం లభిస్తుంది. మధ్యలో అంతరాయాలు ఉండవని ఎన్నికల కమిషనర్‌ వివరించారు. రాజ్యాంగంలో, ప్రజా ప్రాతినిథ్య చట్టంలో తగిన మార్పులు జరిపినప్పుడే ఏకకాల ఎన్నికల నిర్వహణ సాధ్యమవుతుంది. చట్టసభల గడువు ముగియడానికి ఆరు నెలల్లోగా ఎన్నికలను నిర్వహించాలనేది ప్రస్తుతం అమల్లో ఉన్న నిబంధనల సారాంశం. రాజ్యాంగ, చట్టపరమైన మార్పులు చేసిన ఆరు నెలల తర్వాత ఈసీ ఈ ఎన్నికలను నిర్వహించగలదు.