కొబ్బరి పీచు వ్యాపారులకు శుభవార్త... అంతర్జాతీయంగా పెరిగిన ధర

SMTV Desk 2017-10-09 13:21:22  Coconut peach, Internationally raised price, 360 dollars

భీమవరం, అక్టోబర్ 09 : ఆంధ్రప్రదేశ్ లో కొబ్బరి తోటలు, కొబ్బరితో తయారయ్యే ఉత్పత్తులు అధికమన్న విషయం తెలిసిందే. కొబ్బరితో తయారు చేసే తిను బండారాలు కూడా మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఈ నేపధ్యంలో కొబ్బరి పీచుకు కూడా అంతర్జాతీయ మార్కెట్లో మంచి ధర పలుకుతుందని రాజమహేంద్రవరం కాయిర్ బోర్డ్ ఇన్ స్పెక్టరు రామచంద్రరావు సంతోషం వ్యక్త పరిచారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ధర పెరగడంతో పీచు పరిశ్రమల వారు హర్షం వ్యక్తం చేశారు. గతంలో కొబ్బరి పీచు ధర కేజీ రూ.8 ఉండగా, ప్రస్తుతం ధర రూ. 24 కు చేరింది. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో దీని ధర 360 డాలర్లు పలుకుతోంది. పశ్చిమ గోదావరి జిల్లా లో 98 పీచు పరిశ్రమలున్నాయి. వీటి ద్వారా నెలకు 5 వేల టన్నుల పీచు ఉత్పత్తులను ఎగుమతి చేస్తున్నారు. కొబ్బరి పీచు ధర తక్కువ ఉండటం వల్ల గతంలో ఈ పరిశ్రమలు నడపడం కష్టంగా మారింది. కొబ్బరి పీచు తో కరెల్డు కాయిర్ తయారు చేస్తారు. దీనిని రబ్బరైజ్డ్‌ కాయిర్ గా చేసి పరుపుల తయారీలో ఉపయోగిస్తారు. దేశంలో 82 వరకు రబ్బరైజ్డ్ పీచు పరిశ్రమలు ఉన్నాయి. గతంలో చైనాకు మాత్రమే ఈ పీచు ఎగుమతి కాగా, ప్రస్తుతం అన్ని దేశాలు భారత్ నుంచి ఈ కొబ్బరి పీచును కొనుగోలు చేస్తున్నాయి. అంతే కాకుండా కొబ్బరి పీచును బాగా ఎండలో ఆరబెట్టాలి కాని ప్రస్తుతం వర్షాలు పడడం వల్ల ఈ పీచును ఆరబెట్టడం కష్టంగా మారడంతో ఉత్పత్తి తగ్గిపోయింది.