ప్రగతి భవన్ లో ఆత్మీయ సమావేశం జరిపిన కేసీఆర్

SMTV Desk 2017-10-09 11:49:00  Singareni employees in Pragathi bhavan Meeting, CM KCR

హైదరాబాద్, అక్టోబర్ 09 : సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల్లో తెరాస అనుబంధ కార్మిక సంఘం టీబీజీకేఎస్ విజయం సాధించిన సందర్భంగా ముఖ్యమంత్రి అధికారిక నివాసం ప్రగతి భవన్ లో ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున తరలి వచ్చిన సింగరేణి ఉద్యోగులను ఉద్దేశించి మాట్లాడిన సీఎం కేసీఆర్ వారికి మరిన్ని వరాలు ప్రకటించారు. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తామని పునరుద్ఘాటించారు. కార్మికుల సమస్యల పరిష్కారం కోసం సింగరేణి జిల్లాల్లో రాబోయే 20 రోజుల్లో పర్యటిస్తానని కేసీఆర్ పేర్కొన్నారు. అలాగే వారసత్వ ఉద్యోగాల కోసం రైల్వే తరహాలో కొత్త చట్టం తీసుకొస్తామని సీఎం ప్రకటించారు. సింగరేణి మనుగడకు ఉపరితల గనులు అనివార్యమని స్పష్టం చేసిన ఆయన, కార్మికుల శ్రేయస్సుల దృష్ట్యా కొత్తగా ఆరు భూగర్భ గనులు ప్రారంభిస్తామని తెలిపారు. కార్మికులకు గృహ నిర్మాణం కోసం రూ. 10 లక్షల వడ్డీ లేని రుణమందిస్తామని అన్నారు. సింగరేణి లాభాలపై కొన్ని యూనియన్లు ఎన్నికల సందర్భంగా అసత్యాలు ప్రచారం చేశాయని ఆయన విమర్శించారు. కాగా, కంపెనీలోని అన్ని విభాగాలలో లంచాన్ని నిర్మూలించాలని స్పష్టం చేశారు.