దొంగలకు చెక్ పెట్టే యాప్.. ఏపీ వినూత్న ఆలోచన

SMTV Desk 2017-10-08 11:55:20  Locked House Monitoring System, SP Rajasekhar Babu, WiFi modem.

చిత్తూరు, అక్టోబర్ 8 : ఏదైనా ఊరికి వెళ్లి వచ్చేసరికి ఇంట్లో దొంగలు పడి మొత్తం సొమ్మంత దోచుకొని పోతే ఎంత బాధగా ఉంటుంది. అలాగని వెళ్ళకుండా ఉండలేం. వెళ్ళేటప్పుడు ఇంటికి ఎన్ని తాళాలేసినా ప్రయోజనం మాత్రం శూన్యం. అదే మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు పోలీసులు మన ఇంటిపై ఓ కన్నేసి ఉంచితే ఎంత బాగుంటుంది కదా.! కాని అలా వెళ్ళిన ప్రతిసారి పోలీస్ స్టేషన్ వరకు వెళ్లి చెప్పడం అంటే కాస్త కష్టంతో కూడుకున్న పని. ఈ ఆలోచనలకు ఇక కళ్లెం వేసే దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వినూత్న రీతిలో ఆలోచనలకు కార్యరూపం దాల్చింది. ఎంతోమంది ప్రజలు పడుతున్న ఈ ఇబ్బందుల్ని చూసిన ఎస్పీ రాజశేఖర్‌ బాబుకి వచ్చిన ఆలోచనకు రూపమే "లాక్డ్‌ హౌస్‌ మానిటరింగ్‌ సిస్టమ్‌ (ఎల్‌హెచ్‌ఎమ్‌ఎస్‌)" యాప్‌. దీనిని ఫోన్ లో డౌన్‌లోడ్‌ చేసుకుంటే చాలు.. మనం ఎక్కడికి వెళ్ళినా పోలీసులు మన ఇంటిపై ఓ కన్నేసి ఉంచుతారు. కాని దీనికోసం మనం ఓ పని చేయాల్సి ఉంటుంది. ముందుగా యాప్ లో "రిక్వెస్ట్‌ పోలీస్‌ వాచ్‌" ఆప్షన్‌ను క్లిక్‌ చెయ్యాలి. అక్కడ మన యూజర్‌ ఐడీని ఎంటర్‌ చేసి, ఏ తేదీన ఏ సమయానికి ఊరెళ్తున్నాం, ఎప్పుడు తిరిగొస్తాం.. లాంటి వివరాలన్నింటినీ పొందుపరచాలి. అంతే ఆ సమాచారమంతా దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ కు వెళ్ళిపోతుంది. తర్వాత అక్కడ నుండి పోలీస్ అధికారులు వైఫై మోడెమ్ ను, సీసీ కెమెరాను తీసుకొచ్చి ఎవరు గుర్తించకుండా మన ఇంట్లో అమర్చుతారు. మోషన్‌ సెన్సర్లతో పనిచేసే ఈ కెమేరా ఏదైనా అలికిడి అవగానే ఫొటోలూ వీడియోలూ తీసి మన ఫోన్‌కూ పోలీస్‌ కంట్రోల్‌ రూమ్‌కీ పంపించగలదు. అంతే పోలీసులు వెంటనే అప్రమత్తమయి దొంగల్ని పట్టుకునే అవకాశం ఉంది. మరింకెందుకు ఆలస్యం ఒకసారి ట్రై చేయండి.