పెట్రో డీలర్ల దేశ వ్యాప్త సమ్మె:యూపీఎఫ్‌

SMTV Desk 2017-10-08 11:50:03  United Petroleum Front meeting in Mumbai,Indefinite strike 13 and 27th

ముంబయి, అక్టోబర్ 08 : ముంబయిలో యునైటెడ్ పెట్రోలియం ఫ్రంట్‌ సమావేశం జరిగింది. దేశంలోని 54 వేల పెట్రోలియం డీలర్లకు ప్రాతినిధ్యం వహిస్తున్నమూడు సంఘాల నాయకులు ఈ భేటీలో పాల్గొన్నారు. డీలర్ల సమస్య పరిష్కారానికై యునైటెడ్ పెట్రోలియం ఫ్రంట్‌ గా (యూపీఎఫ్‌) ఏర్పడ్డారు. ప్రభుత్వ రంగ సంస్థలైన 3 ఆయిల్ కంపెనీలు, ఐఓసీఎల్, బీపీసీఎల్, హెచ్ పీసీఎల్ నుంచి చాలా కాలంగా అపరిష్కృతంగా ఉన్న డిమాండ్ల సాధన కోసం కార్యాచరణను నిర్ణయించారు. అక్టోబర్ 2న ఆయిల్ కంపెనీలు మార్కెటింగ్ మార్గదర్శకాలను ఏకపక్షంగా సవరించాయని జీరో టోలరెన్సు పేరిట డీలర్ల నుంచి జరిమానా రూపంలో వసూలు చేయాలని నిర్ణయించడం సమంజసం కాదని యూపీఎఫ్ అభిప్రాయపడింది. ఈ కంపెనీని ప్రవేశ పెట్టిన రోజువారీ ధరల విధానం అటు వినియోగ దారుడికి ఇటు డీలర్లకు ఉపయోగంగా లేదని దాన్ని మునుపటి మాదిరిగా సవరించాలని కోరాయి. కంపెనీ నిర్లక్ష్య ధోరణి వ్యతిరేకంగా యునైటెడ్ పెట్రోలియం ఫ్రంట్‌ ఈ నెల 12న అర్ధరాత్రి నుంచి ఒక రోజు కొనుగోలు, అమ్మకాలు నిలిపివేయాలని నిర్ణయించింది. ఒకవేళ కంపెనీలు స్పందించకుంటే అక్టోబర్ 27న కొనుగోలు, అమ్మకాలు ఆపేసి నిరవధిక సమ్మెకు దిగాలని ఈ సమావేశంలో తీర్మానించినట్లు ఆంధ్రపదేశ్ పెట్రోలియం డీలర్ల సమాఖ్యం తెలిపింది.