ఉద్యోగ నియామకాలకు జోనల్ విధానం : సీఎం కేసీఆర్

SMTV Desk 2017-10-08 11:13:12  Job appointments, Zonal system, CM KCR Meeting in Pragathibhavan

హైదరాబాద్, అక్టోబర్ 08 : తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగ నియామకాలు సంబంధించి జోనల్ విధానాన్ని కొనసాగించాలని, కొత్త జోన్లు ఏర్పాటు చేసుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. శనివారం ప్రగతి భవన్‌లో జరిగిన ఉన్నతస్థాయి సమీక్షలో కేసీఆర్‌ ఈ మేరకు ప్రకటించారు. ఇందుకోసం రాష్ట్రపతి ఉత్తర్వులు సవరించవలసి ఉందన్నారు. ఏ పోస్టు ఏ కేడర్‌కు చెందుతుంది.. జోన్లు ఎన్ని ఉండాలి.. ఏ జోన్‌ పరిధిలో ఏయే జిల్లాలు ఉండాలి. నాలుగు కేడర్ల పోస్టులను ఎలా విభజించాలి.. అనే అంశాలపై అధ్యాయనం చేసి నివేదిక ఇవ్వడానికి మంత్రులు, ఉన్నతాధికారులతో ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ కమిటీకి ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరిని చైర్మన్‌గా నియమిస్తూ శనివారం రాత్రి ప్రభుత్వం ఉత్తర్వులు కూడా జారీ చేసింది. ఉమ్మడి రాష్ట్రంలో ఉద్యోగ నియామకాల కోసం ఇచ్చిన రాష్ట్రపతి ఉత్తర్వుల (371డి)ను తెలంగాణ ఏర్పాటు దృష్ట్యా ఇప్పుడు సవరించాల్సి ఉందని కేసీఆర్‌ అధికారులతో అన్నారు. ఇందుకోసం కొత్తగా ఉత్తర్వులివ్వాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్రానికి ప్రతిపాదనలు పంపుతామని తెలిపారు. జిల్లాస్థాయి పోస్టులని కొత్త జిల్లాల ప్రాతిపదికనే జరగాలని ఉపాధ్యాయ నియామకాల నోటిఫికేషన్ కూడా ఈ విధంగానే ప్రకటించాలని సీఎం సూచించారు. అన్ని శాఖల్లోని ఎస్సీ, ఎస్టీ బ్యాక్‌ లాగ్‌ పోస్టులన్నింటినీ తక్షణమే భర్తీ చేయాలని ఆదేశించిన సీఎం ప్రతి నెల చివరి రోజున సమీక్షించాలని వెల్లడించారు.