నా దృష్టిలో ధోనినే మంచి ఫినిషర్ : కర్సాన్‌

SMTV Desk 2017-10-07 16:58:19  Hardy Pandya, MS.Dhoni, Karsan Ghawari.

ఢిల్లీ, అక్టోబర్ 7 : భారత్‌ తరఫున కేవలం 48 అంతర్జాతీయ మ్యాచులు ఆడిన హార్దిక్‌ పాండ్యాను.. ధోనీతో పోల్చడం సరికాదని భారత మాజీ క్రికెటర్‌ కర్సాన్‌ ఘావ్రి అన్నారు. ఫినిషర్‌గా ధోనీ, పాండ్య కంటే వెయ్యి రెట్లు మిన్న.. పాండ్య రుజువు చేసుకోవాల్సింది ఇంకా చాలా ఉందని ఆయన తన అభిప్రాయం వ్యక్తం చేశారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. "భారత్‌కు ధోనీ, పాండ్య రూపంలో ఇద్దరు గొప్ప ఫినిషర్లు దొరికారని కోహ్లీ అన్నాడు. దయచేసి ఇకనైనా పాండ్యను ధోనీతో పోల్చడం ఆపండి. పాండ్యకు మంచి భవిష్యత్తు ఉందనడంలో ఎలాంటి సందేహం లేదు. కాని అతడు ఇప్పుడే ఇప్పుడే ఆటను నేర్చుకుంటున్నాడు.. ధోనీ అలా కాదు తనేంటో గత కొన్నాళ్లుగా నిరూపించుకుంటూనే ఉన్నాడు. ధోనీ.. పాండ్య కంటే వెయ్యి రెట్లు మెరుగైన ఫినిషర్‌. వీరిద్దరి మధ్య చాలా వ్యత్యాసం ఉంది. ఈ రోజుకైనా అతడు నాలుగైదు ఓవర్లలో గేమ్‌ స్వరూపాన్ని మార్చేయగల సత్తా ఉన్న ఆటగాడు. ధోనీ భారత్‌ తరఫున ఇప్పటి వరకు 474 (టెస్టులు-90, వన్డేలు-306, టీ20లు-78) మ్యాచులకు ప్రాతినిధ్యం వహించాడు. పాండ్య ఆసీస్‌తో వన్డే సిరీస్‌లో రాణించినంత మాత్రాన అతన్ని ధోనీతో పోల్చడం.. గొప్ప ఫినిషర్‌ అనడం సరికాదు" అని వ్యాఖ్యానించారు.