ఉప‌కుల‌ప‌తుల‌తో గ‌వ‌ర్న‌ర్ భేటీ

SMTV Desk 2017-10-07 16:18:06  University, vice-chancellors , Governor ESL Narasimhan Meeting

హైదరాబాద్, అక్టోబర్ 07 : విశ్వవిద్యాలయ ప్రమాణాలకు ఉన్నతస్థాయికి పెంచాలని ఉప‌కుల‌ప‌తుల‌కు గ‌వ‌ర్న‌ర్ ఈఎస్ఎల్ న‌ర‌సింహ‌న్ దిశానిర్దేశం చేశారు. నాణ్యమైన విద్యా బోధన, ఇతర సదుపాయాలు మెరుగుపరిచేందుకు ఖచ్చితమైన ప్రణాళికతో కసరత్తు చేయాలని పేర్కొన్నారు. ఆరు నెలల్లో అధ్యాపక ఖాళీలను భర్తీ చేయాలని ఆదేశించారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తరువాత మొదటిసారి గవర్నర్ నరసింహన్ విశ్వవిద్యాలయాల ఉప‌కుల‌ప‌తుల‌తో అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో భేటీ అయ్యారు. ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి, ఉన్నత విద్యామండలి చైర్మన్ పాపిరెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సుమారు 4 గంటలపాటు జరిగిన ఈ సమావేశంలో వర్సీటి లకు సంబంధించిన వివిధ అంశాలపై లోతుగా ఆరాతీశారు. అకాడమిక్‌ క్యాలెండర్‌ను రూపొందించి జూలైలోనే విద్యా సంవత్సరం ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకోవాలని గవర్నర్ నరసింహన్ సూచించారు. అవినీతి, అక్రమాలు వెలుగులోకి రావడంపై అసంతృప్తి వ్యక్తం చేసిన ఆయన ఇకముందు పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యాత ఉప‌కుల‌ప‌తుల‌దే అని స్పష్టం చేశారు. పీహెచ్‌డీ ప్రవేశాలు పారదర్శకంగా జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రస్తుతం ఉన్న కోర్సుల‌ను స‌మీక్షించి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించే దృష్టి పెట్టాలని తెలిపారు.