ప్రభుత్వ ఉద్యోగ దంపతులకు సంయుక్త ఉత్తర్వులు

SMTV Desk 2017-10-07 11:39:04  Deputation for the government employees who are husband and wife between Telangana and Andhra Pradesh,

హైదరాబాద్, అక్టోబర్ 07 : తెలుగు రాష్ట్రాల ప్రభుత్వ ఉద్యోగుల దంపతులకు ప్రభుత్వం తీపి కబురు అందించింది.... తెలంగాణ, ఆంధ్రపదేశ్ రాష్ట్రాల మధ్య భార్యాభర్తలైన ప్రభుత్వ ఉద్యోగుల డిప్యుటేషన్‌ కు సర్వం సిద్దమైంది. తెలుగు రాష్ట్రాల్లో భార్యభర్తలో ఎవరో ఒకరు రాష్ట్ర ప్రభుత్వ పరధిలో, మరొకరు కేంద్ర ప్రభుత్వ పరధిలో విధులు నిర్వహిస్తుంటే వారు ఒకే చోట పని చేసేలా అవకాశం కల్పించనున్నారు. ఒక రాష్ట్రంలో పని చేస్తున్న ప్రభుత్వ ఉద్యోగి భార్య లేదా భర్త మరో రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు బ్యాంకు ల్లో పని చేస్తుంటే అలాంటి వారికి డిప్యుటేషన్‌ వర్తిస్తుందని స్పష్టం చేశారు. అనంతరం రాష్ట్ర డిప్యుటేషన్లకు మార్గదర్శకాలను జారీ చేస్తూ తెలంగాణ, ఆంధ్రపదేశ్ ప్రభుత్వాల ప్రధాన కార్యదర్శులు ఎస్‌.పి.సింగ్‌, దినేష్‌కుమార్‌లు శుక్రవారం సంయుక్తంగా ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, స్థానిక సంస్థల ఉద్యోగులకు ఇది వర్తిస్తుందన్నారు. రెండు రాష్ట్ర ప్రభుత్వాల సచివాలయ శాఖలు ఈ మార్గదర్శకాలను అనుసరించాలని సూచించారు. రెగ్యులర్ ఉద్యోగులకే ఈ నిబంధనలు వర్తిస్తాయని వివరించారు. ఈ మేరకు డిప్యుటేషన్‌ కోసం దరఖాస్తు నమూనాను విడుదల చేశారు. కేంద్ర ప్రభుత్వ శాఖ, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు, విశ్వవిద్యాలయాలు, స్థానిక సంస్థలు, షెడ్యూల్ బ్యాంకులు, రాష్ట్ర ప్రభుత్వ సంస్థల్లో పని చేస్తున్నవారికి ఈ నిబంధనలు వర్తిస్తాయి.