ఒక వైపు పాఠశాల ఉపాధ్యాయుడు.. మరో వైపు గురుకుల శిక్షకుడు

SMTV Desk 2017-06-06 18:06:58  Mahaboobnagar,Jamistapoor village,Primary school,Residential schools

మహబూబ్ నగర్, జూన్ 6 : ఆయన పాఠశాలకు వచ్చామా.. వెళ్లామా అన్నట్లుగా ఉండలేదు.. విద్యార్థులకు ఏదైనా చేయాలనుకున్నారు.. వారి భవిష్యత్తుకు మరింత భరోసా కల్పించాలనుకున్నారు.. తాను తీసుకున్న నిర్ణయంతో బడిలో విద్యార్థులు తగ్గుతుందని తెలిసినా పట్టించుకోలేదు.. చిన్నారుల భవిష్యత్తే ధ్యేయంగా గురుకుల పాఠశాలల్లో ప్రవేశాలకు శిక్షణ ఇచ్చి 38 మంది ఎంపికయ్యేలా చేశారు.. మహబూబ్‌నగర్‌ మండలం జమిస్తాపూర్‌ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు సత్యం స్ఫూర్తిమంతంగా నిలుస్తున్నారు.. మహబూబ్‌నగర్‌ మండల పరిధిలోని జమిస్తాపూర్‌ గ్రామంలోని ప్రాథమిక పాఠశాలకు 2011లో ఉపాధ్యాయులు సత్యం, కవిత బదిలీపై వెళ్లినప్పుడు ఆ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య 60. సరిపడా తరగతి గదులు లేక చెట్ల కింద చదువులు చెప్పారు. ఆ తరవాత రెండు తగరతి గదులు నిర్మించడంతో కొంత ఇబ్బంది తప్పింది. మొదట అక్కడి పరిస్థితులు చూసి ఎందుకు ఈ పాఠశాలకు వచ్చామా అనుకున్న ఉపాధ్యాయులు సత్యం, కవిత గ్రామ ప్రజాప్రతినిధులు, యువజన సంఘాల సహకారంతో పాఠశాల అభివృద్ధికి పాటుపడ్డారు. దీంతో 2012-13 విద్యా సంవత్సరంలో పాఠశాలలో విద్యార్థుల సంఖ్య 80కి చేరింది. మొదటి ప్రయత్నంలోనే.. : గురుకుల శిక్షణను 2013-14 విద్యా సంవత్సరంలో ప్రారంభించారు. ఆ సమయంలో అనిత, చంద్రకళ అనే ఇద్దరు విద్యార్థినులకు శిక్షణ ఇవ్వగా అనితకు మహబూబ్‌నగర్‌ మండల పరిధిలోని రాంరెడ్డిగూడెం గురుకులంలో, చంద్రకళకు నారాయణపేట గురుకుల పాఠశాలలో సీట్లు వచ్చాయి. ఆ గ్రామం నుంచి గురుకుల పాఠశాలలకు విద్యార్థులు ఎంపిక అవడం అదే మొదటిసారి. అనంతరం సత్యం తోటి ఉపాధ్యాయులతో కలిసి తల్లిదండ్రులకు గురుకుల పాఠశాలలపై అవగాహన కలిగించడంతో వారు కూడా ఆసక్తి చూపారు. దీంతో ప్రతి ఏడాది విద్యార్థులకు శిక్షణ ప్రారంభమైంది. 2016-17 విద్యా సంవత్సరంలో నాలుడో తరగతిలో 19 మంది ఉండగా 14 మందిని గురుకుల ప్రవేశ పరీక్ష రాయించారు. వీరిలో 12 మంది గురుకుల పరీక్షకు ఎంపిక అయ్యారు. అయిదో తరగతిలో ఏడు మందిని గురుకుల పరీక్ష రాయించగా ఇద్దరు ఎంపిక అయ్యారు. ఇలా 2014 నుంచి 2017 సంవత్సరం వరకు 38 మంది గురుకులాల్లో సీట్లు సాధించారు. విద్యార్థుల సంఖ్య పెరిగింది : గురుకుల పాఠశాలలకు విద్యార్థులు ఎంపికవడంతో గ్రామస్థులకు పాఠశాలపై నమ్మకం ఏర్పడింది. దీనితో పిల్లలకు గురుకుల సీటు రావాలంటే కచ్చితంగా గ్రామ ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని భావించారు. 2011 సంవత్సరంలో పాఠశాలలో 60 మంది విద్యార్థులు ఉండగా ప్రస్తుతం 112 మంది విద్యార్థులు ఉన్నారు. ప్రతి తరగతిలో విద్యార్థుల సంఖ్య బాగానే ఉన్నప్పటికి నాలుగు, అయిదు తరగతుల్లో మాత్రం విద్యార్థుల సంఖ్య పదికి మించి ఉండదు. విద్యార్థులు గురుకుల పాఠశాలకు వెళ్లడంతో ఈ పరిస్థితి ఉంది. విద్యార్థుల సంఖ్య తగ్గినప్పటికి పిల్లల భవిష్యత్తు ముందు ఇదేమి సమస్య కాదని ఉపాధ్యాయులు పేర్కొంటున్నారు. ఇలా ఆలోచన వచ్చింది : జమిస్తాపూర్‌లో అయిదో తరగతి వరకు మాత్రమే పాఠశాల ఉంది. ఉన్నత చదువులు చదవాలంటే విద్యార్థులు ధర్మాపూర్‌ పాఠశాలకు వెళ్లాలి. దూరం కావడంతో చాలా మంది విద్యార్థులు మానేసేవారు. దీంతో వారిని ఎలాగైనా కళాశాల చదువులైనా చదివేలా చేయాలని ఉపాధ్యాయుడు సత్యం ఆలోచించారు. గురుకులాల్లో ప్రవేశంతోనే వారి చదువు నిరాటంకంగా సాగుతుందని భావించారు. ఆయన ఆలోచనకు తోటి ఉపాధ్యాయులు సహకరించారు.