లాలూను 7 గంటలు విచారించిన సీబీఐ

SMTV Desk 2017-10-06 13:44:07  CBI, Railway Former minister RJD supremo Lalu Prasad Yadav,

న్యూఢిల్లీ, అక్టోబర్ 06 : రైల్వే హోటళ్ల కేటాయింపు అవకతవకల కేసు విచారణలో భాగంగా ఆ శాఖ మాజీ మంత్రి ఆర్జేడీ అధినేత లాలుప్రసాద్ యాదవ్ ను సీబీఐ సుదీర్ఘంగా విచారించింది. సుమారు 7 గంటలపాటు లాలూను కేంద్ర దర్యాప్తు సంస్థ అధికారులు ప్రశ్నించారు. గురువారం ఉదయం 11 గంటలకు లాలూ సీబీఐ కార్యాలయానికి చేరుకోగా, సాయంత్రం 6 గంటల వరకు కేంద్ర దర్యాప్తు సంస్థ అధికారులు ఆయనను ప్రశ్నించారు. లాలూతో ఆయన కుమార్తె మీసా భారతి వచ్చినప్పటికీ అధికారులు ఆమెను లాభిలోనే కూర్చోవాలని సూచించారు. 2006లో లాలూప్రసాద్ రైల్వే మంత్రిగా ఉన్నప్పుడు రాంచీ, పూరీలోని హోటల్ టెండర్ల లో జరిగిన అవకతవకల పై కేసు నమోదు చేసిన సీబీఐ, లాలూ ఆయన కుమారుడు తేజస్వీ యాదవ్ లకు సమన్లు జారీ చేసింది. ఈ సమన్లు అందుకున్న ఆయన ఢిల్లీలో సీబీఐ అధికారుల ముందు విచారణకు హజరయ్యారు. నేడు కూడా లాలూ విచారణకు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ఈ కేసు విచారణలో భాగంగా గతంలోనే సీబీఐ వివిధ ప్రాంతంలోని లాలూ ఆయన కుటుంబ సభ్యుల నివాసాల్లో సోదాలు చేసి పలు ఆధారాలను కూడా సేకరించినట్లు తెలుస్తోంది.