సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షునిగా అఖిలేష్ యాదవ్

SMTV Desk 2017-10-05 17:02:18  akhileshyadav, samajvadee party, adhyaksha ennika

న్యూ ఢిల్లీ అక్టోబర్ 5: ఆగ్రాలో సమాజ్ వాదీ పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాల సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో అధ్యక్షుని ఎన్నికల కార్యక్రమం జరిగింది. సమాజ్ వాదీ పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఆ పార్టీ సీనియర్ నేత రాంగోపాల్ యాదవ్ గురువారం ప్రకటించారు. అఖిలేష్ యాదవ్ పార్టీ అధ్యక్షుడిగా ఐదేళ్ల పాటు కొనసాగునున్నట్లు ఆయన తెలిపారు. అఖిలేష్ యాదవ్ నాయకత్వంలో 2019 లోక్ సభ, 2022 ఉత్తర ప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో పోటిచేస్తామని అయన వివరించారు. అయితే ఈ సమావేశానికి అఖిలేష్ తండ్రి అయిన ములాయం సింగ్ యాదవ్ హాజరు కాలేదు. గతంలో యూపీ ఎన్నికల సమయంలో ములాయంకు, అఖిలేష్‌కు మధ్య విభేధాలు తారాస్థాయికి చేరిన విషయం తెలిసిందే. దీంతో అప్పటి నుంచి పార్టీ కార్యక్రమాలకు ములాయం దూరంగా ఉంటున్నారు. ఈ కారణంగానే అక్టోబర్ 5 ఆగ్రాలో నిర్వహించే జాతీయ కార్యవర్గ సమావేశానికి రావాలని స్వయంగా అఖిలేష్ యాదవ్ పిలిచినప్పటికి ములాయం సింగ్ యాదవ్ ఈ సమావేశానికి రాలేదనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. అయితే ఈ వ్యాఖ్యలపై స్వయంగా అఖిలేష్‌ యాదవ్ స్పందిస్తూ...ములాయం నన్ను ఫోన్లోనే ఆశీర్వదించారని, అలాగే శివపాల్‌ యాదవ్‌ కూడా నన్ను ప్రత్యేకంగా అభినందించారని ఆయన తెలిపారు.