ఐటి వృద్ధి మందగించినా ..ఉద్యోగాల్లో కోత లేదు

SMTV Desk 2017-06-06 16:22:02  it, kris gopalakrishna, it growth down,

హైదరాబాద్, జూన్ 6 : ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగం మందగించిందని ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకులు క్రిస్ గోపాల కృష్ణన్ వెల్లడించారు. ఐటి వృద్ధి మందగించిన కారణంగా నియామకాలు, ప్రమోషన్ల అవకాశాలు తగ్గాయని వివరించారు. అయితే భారీగా ఐటీ ఉద్యోగాల కోత అమలు అవుతుందనేది అవాస్తవమని ప్రకటించారు. వృద్ధి రేటు తగ్గినప్పుడు కొత్తగా ఉద్యోగులను తీసుకోవాల్సిన అవసరం కూడా తక్కువగా ఉంటుందని..ఇక మరింత ఎక్కువ మంది ఉద్యోగుల అవసరం లేనందువల్ల ప్రమోషన్ అవకాశాలు కూడా తగ్గుతాయని ఆయన వివరించారు. భారీ స్థాయిలో ఉద్యోగులను తొలగించడాన్ని నేనైతే చూడలేదు..వినలేదు..సాధారణంగా ప్రమోషన్ల ప్రక్రియ ఎప్పుడూ కఠినతరం అవుతూనే ఉంటుందని..ఇది ఆటో మేటిక్ గా జరిగిపోతుంది అని ఆయన వివరించారు. ప్రమోషన్ల ప్రక్రియ కఠినతరంగా ఉంటుందని, మదింపు ప్రక్రియ మరింత కఠినతరం అవుతుందని ఆయన చెప్పారు. అయితే ఐటీ రంగంలో ఇది సర్వసాధారణమని.. గతంలో 2001లో, 2008 లోనూ ఇలాంటివే చోటు చేసుకున్నాయని ఆయన పేర్కొన్నారు. ఐటీ రంగం వృద్ధిపై ప్రస్తుతం పలు అంశాలు ప్రతికూల ప్రభావం చపుతున్నాయన్నారు. భారత ఐటీ ఎక్కువగా ఆధారపడే ఆమెరికా, యూరప్ లో వృద్ధి మందగించడం ఒక కారణం కాగా, ప్ర స్తుతం కూడా మెరుగైన వృద్ధి సాధిస్తున్నప్పటికీ.. ఇప్పటికే దేశీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగం భారీగా పెరగడంతో బేస్ ఎఫెక్ట్ వల్ల అది నామమాత్రంగానే కనిపిస్తుండ వచ్చని ఆయన వివరించారు. ఐటీ రంగ ఉద్యోగులు యూనియన్ ఏర్పాటు ప్రతిపాదనపై స్పందిస్తూ ఇది సరైన యోచన కాదని చెప్పారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగం ఉద్యోగులు భారీ జీతాలే అందుకుంటున్నారని, కంపె నీలూ వారిని బాగానే చూసుకుంటున్నాయని, పైగా ఉద్యోగాలు మారేందుకు వారికి అనేక అవకాశాలు ఉన్నాయన్నారు. ఐటీలో యూనియన్ ఏర్పాటు ఆలోచన సరికాదు, ఫ్యాక్టరీల్లో పనిచేస్తున్న వారికైతే అది అర్థవంతంగా ఉంటుంది..కానీ ఐటీ రంగం అలాంటిది కాదు..ఉద్యోగులకు మంచి జీతాలు ఉంటాయి. అలాగే ప్రత్యామ్నాయంగా అవకాశాలు ఉంటాయి అని వివరించారు. ఐటీలో ఇప్పటికీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ మెుదలైన కీలక విభాగాల్లో ఇప్పటికీ సిబ్బంది అవ సరమన్నారు. సరైన నిపుణులు దొరకని అమెరికా కంపెనీలు భారత్ వైపు మెుగ్గుచూపొచ్చని ఆయన వివరించారు.