జీఎంఆర్ ప్రతినిధులతో సీఎం కేసీఆర్ సమీక్ష

SMTV Desk 2017-10-04 11:44:19  Airport City, Pragati Bhavan, CM KCR

హైదరాబాద్, అక్టోబర్ 04 : హైదరాబాద్ శివార్లలోని శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం విస్తరణ ఎయిర్ పోర్టు సిటీ నిర్మాణంపై అంతర్జాతీయ ప్రమాణాలతో అద్భుతమైన విమానాశ్రయంగా తీర్చిదిద్దాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతి భవన్ లో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. 2008 లో ప్రారంభమైన విమానాశ్రయ పురోగతిని వివరించిన జీఎంఆర్ ప్రతినిధులు, అనతి కాలంలో ప్రపంచంలోనే అగ్రగామిగా నిలిచిందని ఐటీ వినియోగం సహా అనేక విషయాల్లో ముందంజలో ఉందని తెలిపారు. ప్రస్తుతం రోజుకు 4 వందల విమానాలు వచ్చి పోతున్నాయని ఏడాదికి 1.70 లక్షల మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారని వివరించారు. రాష్ట్ర ఆవిర్భావానికి ముందున్న వృద్ధి రేటు ప్రస్తుతం 20.4% పెరిగిందని మున్ముందు ఇంకా పెరుగుతుందని చెప్పారు. ఇప్పుడు ఉన్న టర్మినల్, రన్ వే దాదాపు రెండున్నర కోట్ల మంది ప్రయాణికుల రాకపోకలకు అనువుగా ఉందని వృద్ధి రేటు అంచనా ప్రకారం టర్మినల్ విస్తరణతో పాటు రెండో రన్ వే నిర్మాణం అవసరమవుతుందని అభిప్రాయపడ్డారు. రెండో రన్ వే ను మూడేళ్లలో పూర్తి చేస్తామని ఇందుకు ప్రభుత్వ సహకారం కావాలని జీఎంఆర్ ప్రతినిధులు కోరారు. ప్రభుత్వ పరంగా విమానాశ్రయ విస్తరణకు అవసరమైన సహాయం అందిస్తామని భరోసా ఇచ్చిన సీఎం కేసీఆర్, రాబోయే 25 ఏళ్ల ఏర్పడే రద్దీని కూడా అంచనా వేసుకుని టర్మినల్ విస్తరణతో పాటు రెండో రన్ వే నిర్మాణం కూడా చేపట్టాలని చెప్పారు. ప్రపంచ స్థాయి సదస్సులు నిర్వహించుకునేలా 12 వేల మంది సామర్థ్యంతో సమావేశమందిరం అంతర్జాతీయ ప్రదర్శనల కోసం ఎగ్జిబిషన్‌ హాల్ నిర్మించాలని నిర్దేశించారు. ఈ సమీక్షలో ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్‌శర్మ, ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్‌, ముఖ్య కార్యదర్శులు ఎస్‌. నర్సింగరావు, రామకృష్ణారావు, నవీన్‌ మిట్టల్‌, హెచ్‌ఎండీఏ కమిషనర్‌ చిరంజీవులు, జీఎంఆర్‌ గ్రూపు ఛైర్మన్‌ గ్రంథి మల్లికార్జునరావు, విమానాశ్రయ బిజినెస్‌ ఛైర్మన్‌ బొమ్మిడాల శ్రీనివాస్‌, జీఎంఆర్‌ బిజినెస్‌ ఛైర్మన్‌ బీవీఎన్‌రావు, సీఈవో ఎస్‌జీకే కిశోర్‌, సంచాలకులు ప్రసన్న తదితరులు పాల్గొన్నారు.