హోరాహోరీగా నిర్వహించిన ఎన్నికల ప్రచారం..

SMTV Desk 2017-10-04 11:00:14  Singareni elections, Telangana coal mine chairperson, mp kavitha.

కొత్తగూడెం, అక్టోబర్ 4 : సింగరేణి ఎన్నికలలో గెలుపే లక్ష్యంగా అధికార, విపక్షాల ప్రచారం జోరుగా సాగింది. నిన్నటితో ఎన్నికల ప్రచారం ముగియగా.. చివరిరోజు తెరాస అనుబంధ సంఘం, అఖిల పక్షం నేతలు హోరాహోరీగా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా కొత్తగూడెం ఏరియాలోని జీకే ఉపరితల గనిలో ఏర్పాటైన సభలో ఎంపీ కవిత మాట్లాడుతూ.. తెలంగాణాలోని పరిశ్రమలను అభివృద్ధి చేయడమే కాకుండా ఉద్యోగుల హక్కులను పరిరక్షించే దిశగా ముఖ్యమంత్రి కేసిఆర్ అడుగులు వేస్తున్నారని అన్నారు. ప్రచారంలో భాగంగా ఆమె పలు జిల్లాలు కొత్తగూడెం, ఇల్లెందు, మణుగూరు కార్పొరేట్ ఏరియాలలో పర్యటించారు. అక్కడి కార్మికులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. సింగరేణిలో కొత్త ఉద్యోగాలకు ప్రకటనలను విడుదల చేసి ఉద్యోగాలిచ్చారని అన్నారు. అన్ని ప్రభుత్వాలు కార్మికుల వాటాల్లో కేవలం ఒకటి, రెండు శాతాన్ని మాత్రమే ఇప్పటివరకు పెంచుతూ రాగా.. ఒక్క తెరాస ప్రభుత్వం మాత్రమే 16 శాతం నుంచి 25 శాతానికి పెంచిందన్నారు. తెలంగాణ ప్రభుత్వం చిత్తశుద్ధితో చేస్తున్న పనులను అర్ధం చేసుకొని, తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘానికి ఓటు వేసి కేసిఆర్ ప్రభుత్వానికి మద్దతు తెలపాలని కవిత కార్మికులను కోరారు. కాగా గురువారం జరగనున్న ఎన్నికలకు అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నారు.