బీఎస్ఎఫ్ క్యాంపుపై ఉగ్రదాడి.. ఇద్దరు ఉగ్రవాదుల హతం...

SMTV Desk 2017-10-03 17:57:46  BSF, paramilitary, Jammukasmir, Militants

శ్రీనగర్‌, అక్టోబర్ 03: జమ్మూకశ్మీర్ లో ఉగ్రవాదుల ఆత్మాహుతి దాడి ప్రయత్నాన్ని భారత సైన్యం సమర్ధవంతంగా తిప్పికొట్టింది. హోరాహోరీ పోరులో ఇద్దరు ముష్కరులను మట్టు పెట్టింది. ఈ కాల్పుల్లో ఒక బీఎస్ఎఫ్ అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ అమరుడయ్యారు. శ్రీనగర్ విమానాశ్రయానికి అతి సమీపంలో నాలుగు అంచెల భద్రత దళాలు ఉండే సరిహద్దు భద్రత దళ 182వ బెటాలియన్‌ శిబిరంపై తీవ్రవాదులు ఆత్మహత్య దాడికి ప్రయత్నించారు. భారీగా ఆయుధాలు ధరించిన ముగ్గురు తీవ్రవాదులు ఉదయం 4 గంటల ప్రాంతంలో బీఎస్ఎఫ్ క్యాంపు పై దాడికి పాల్పడగా జవాన్లు ఎదురు దాడికి దిగారు. ఈ కాల్పుల్లో మొదట ఒక ఉగ్రవాదిని మట్టు పెట్టారు. బీఎస్ఎఫ్ జవాను వీరమరణం ఈ క్రమంలో ముగ్గురు సైనికులు, ఒక పోలీసు అధికారికి గాయాలయ్యాయి. తరువాత చికిత్స పొందుతూ బీఎస్ఎఫ్ జవాను తుది శ్వాస విడిచాడు. బీఎస్ఎఫ్ శిబిరంలో ఉన్న భవంతిలోకి ఉగ్రవాదులు చొరపడగ, చుట్టుముట్టిన సైనికులు ఎదురు కాల్పుల్లో మరో ఉగ్రవాదిని హతమార్చారు. మిలిగిన ముష్కరులను అంతమొందించేందుకు ఇంకా ఎదురు కాల్పులు కొనసాగిస్తున్నారు. ఈ ఘటన నేపథ్యంలో శ్రీనగర్ విమానాశ్రయాన్ని కాసేపు మూసేసిన సైన్యం తరువాత తనిఖీలు నిర్వహించి ఉద్యోగులను ప్రయాణికులను అనుమతించింది. పరిసర ప్రాంతాల్లోని పాఠశాలలను సైన్యం మూసివేసింది. జైష్‌ ఈ మహమ్మద్‌ తీవ్రవాద సంస్థ ఈ దాడికి పాల్పడినట్లు భావిస్తున్నారు.