అంగరంగ వైభవంగా పైడితల్లి ఉత్సవాలు

SMTV Desk 2017-10-03 17:51:22  vizianagaram, pydithalli ammavaru,

విజయనగరం, అక్టోబర్ 3 : విజయనగరం జిల్లా ప్రజల కల్పవల్లి అయిన పైడితల్లి అమ్మవారి ఉత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. నెల రోజుల పాటు అమ్మవారి జాతర అట్టహాసంగా జరగనుంది. ఈ ఉత్సవాల్లో భాగంగా సోమవారం తోలేళ్ళ ఉత్సవం జరుపుకున్న అమ్మవారు, నేడు సిరిమానోత్సవంతో దర్శనమివ్వనున్నారు. మధ్యాహ్నం రెండు గంటల సమయంలో జిల్లా కలెక్టర్ పర్యవేక్షణలో ఈ సంబరాలు ఆరంభమయ్యాయి. ఈ సంవత్సరం అమ్మవారి దర్శనానికి విఐపి పాసులను రద్దు చేసి, ప్రత్యేక టిక్కెట్లను ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చింది. అమ్మవారి దర్శనానికి క్యు లైన్లు ఏర్పాటు చేయగా, వృద్దులు, దివ్యాంగులకు ప్రత్యేక వరుసలు కల్పించారు. ఈ వైభవాన్ని తిలకించేందుకు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి సుమారు 4 లక్షల మంది భక్తులు తరలి వస్తారని ప్రభుత్వం అంచనా వేసింది. ఈ ఉత్సవాలలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా రెండువేల మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేయగా, ఆర్టీసీ సుమారు 200 బస్సులు నడుపుతోంది. ముడులాంతర్ల నుంచి కోట వరకు సిరిమాను తిరిగే రోడ్డుకు ఇరువైపులా బారీకేడ్లు ఏర్పాటు చేశారు. ఈ వైభవాన్ని పురస్కరించుకొని ఆలయ ధర్మకర్త, కేంద్ర మంత్రి పూసపాటి ఆశోక్ గజపతిరాజు అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు.