ఉద్యోగం కావాలంటే తెలుగు తప్పనిసరి చేయాలి : వెంకయ్య

SMTV Desk 2017-10-03 15:24:29  Vice-President, Venkiah Naidu, National Highways, Water Transport Projects.

అమరావతి, అక్టోబర్ 3 : ఏపీలో జాతీయ రహదారులు, జల రవాణా ప్రాజెక్టులకు ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... ఏపీలో తెలుగు భాషను తప్పనిసరి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కోరారు. ఉద్యోగం కావాలంటే తెలుగు తప్పనిసరిగా వచ్చి ఉండాలన్న నిబంధనను అమలు చేయాలని సూచించారు. తెలుగు మీడియంలో చదువుకొని తానూ ఉపరాష్ట్రపతి అయ్యానని, అలాగే చంద్రబాబు నాయుడు, ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఇంగ్లిష్ మీడియంలో చదువుకోలేదని, అయిన వారు ఉన్నత స్థానాలలో ఉన్నారన్నారు. కేవలం ఇంగ్లిష్ మీడియంలో చదువుకుంటేనే ఎదుగుతాం, తెలుగులో అయితే ఎదుగుదల ఆగిపోతుందన్న అపోహలను పెట్టుకోకూడదన్నారు. ఇప్పుడున్న యువతకు పర భాషా వ్యామోహం ఎక్కువైంది.. అందుకని ఉద్యోగం రావాలంటే తెలుగు వచ్చి ఉండాలన్న నిబంధనను తప్పనిసరి చేయాలన్నారు. అంతేకాకుండా దేశవ్యాప్తంగా నదులు ఇంకిపోతున్నాయని, దీనికోసం నదుల అనుసంధానం చాలా అవసరమని పేర్కొన్నారు. కృష్ణా-గోదావరి నదులను అనుసంధానం చేసిన ఘనత చంద్రబాబుదేనని కొనియాడారు. నదులు అనుసంధానమైతే చాలా వరకు నీటి సమస్య తీరుతుందని, నదుల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు.