భారీ వర్షానికి జలమయమైన భాగ్యనగరం

SMTV Desk 2017-10-03 11:04:34  Hyderabad, heavy rains, traffic problems, ghmc officers.

హైదరాబాద్, అక్టోబర్ 3 : భాగ్యనగరంలో నిన్న ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి నగరం మొత్తం జలమయమైంది. సాయంత్రం చిన్నగా ప్రారంభమైన ఈ వర్షం తీవ్రమైన గాలులతో ఉగ్రరూపం దాల్చి౦ది. దీంతో నగరం మొత్తం విద్యుత్ సరఫరా నిలిచిపోయి చీకటి అలుముకుంది. సుమారు పదమూడు సెంటీమీటర్ల మేర కురిసిన వర్షానికి హైదరాబాద్ నగరం జలసంద్రంలా తయారయ్యింది. ఎక్కడికక్కడే జనజీవనం స్థంభించిపోయి.. ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఈ అక్టోబర్ నెలలో కురిసిన వర్షమే గత పదేళ్లలోని అత్యధిక వర్షపాతంగా నమోదైంది. నగర వ్యాప్తంగా రోడ్ల పైకి నీరు చేరిపోయి నాళాలు పొంగిపొర్లుతున్నాయి. కొన్నిచోట్ల విద్యుత్ స్తంభాలు కూలిపోయి విద్యుత్ తీగలు తెగి పడడంతో ఓ వ్యక్తి మృతి చెందాడు. గోడ కూలిపోయి తండ్రి, కొడుకు, వేర్వేరు ఘటనలలో మరో ముగ్గురు మృత్యువాత పడ్డారు. ఇంతటి వర్షాన్ని ఇటీవల కాలంలో ఎప్పుడు చూడలేదని జీహెచ్ఎంసీ అధికారులు పేర్కొన్నారు. ఈ క్రమంలో తెలంగాణ ప్రభుత్వం ముందస్తు జాగ్రత్తగా విద్యాసంస్థలు, కార్యాలయాలకు సెలవు ప్రకటించింది. ఈ పరిస్థితిని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్షించి ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని కోరారు. రానున్న మరో రెండు రోజుల పాటు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని, ప్రజలందరూ జాగ్రత్త వహించాలని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.