నరమాంస దంపతులు...

SMTV Desk 2017-09-27 16:05:30  

మాస్కో, సెప్టెంబర్ 27 : ఎక్కడైనా మాంసాహార ప్రియులుగా కొంతమందిని చూస్తూనే ఉంటాం.. ఇందులో విచిత్రం ఏమిలేదు. కాని సాధారణ వ్యక్తులు మనుషులను చంపీ ఆరగించేయడం మాములు విషయం కాదు కదా! అవును ఇది నిజం... రష్యాలోని క్రాస్‌నోడర్‌లో నివసిస్తున్న నటాలీకి 42 ఏళ్లు, భర్త దిమిత్రీ బక్షీవ్‌కి 35 సంవత్సరాలు వీరు దాదాపు ఇప్పటి వరకు 30 మంది చంపి నమిలి భోజనం చేసేశారు. చూడటానికి మామూలుగా కనిపించే ఈ దంపతులిద్దరూ 1999 నుంచి బాగా నరమాంసం రుచిమరిగారు. అవసరమైనప్పుడల్లా దొరికిన మనిషిని దొరికట్లే చంపేసి తినేసేవారు. దిమిత్రీ భవన నిర్మాణ కార్మికుడిగా పని చేసుకునేవాడు. భార్య నటాలీ మాత్రం ఇంట్లోనే సీసాల కొద్దీ మద్యాన్ని ఖాళీ చేసేస్తుండేదని పొరుగునే ఉన్న దుకాణదారు ఒకరు తెలిపారు. దిమిత్రీతో పాటు పనిచేసే మరో భవన నిర్మాణ కార్మికుడికి దిమిత్రీ మొబైల్‌ దార్లలో దొరికింది. ఎవరిదా! అని చూస్తుంటే అందులో ఖండఖండాలుగా నరికి ఉన్న మానవ శరీర భాగాల ఫొటోలు కనిపించాయి. ఉలిక్కిపడిన ఆ వ్యక్తి మరింతగా వెతికేసరికి ఓ మృతదేహం శరీరభాగాన్ని నోట్లో పెట్టుకుని నవ్వుతూ ఫొటోకు ఫోజు ఇచ్చిన దిమిత్రీ కనిపించాడు. దీంతో, ఆ వ్యక్తి భయంతో వణికిపోయాడు. నేరుగా ఫోన్‌ను పట్టుకుని పోలీసులకు తీసుకెళ్లి చూపాడు. పోలీసులు రావడం...దిమిత్రీ నివాసంపై దాడిచేయడం...లోపల కొన్ని మృతశరీర భాగాలు కనిపించడం ...నిలవ చేసి ఉన్న మాంసఖండాలు కనుగొనడం ...అన్నీ వరసగా జరిగిపోయాయి. వెంటనే వారిద్దరినీ అరెస్టు చేసి ఆరా తీస్తే.....వారు నరమాంసం రుచిమరిగిన వైనం వెలుగు చూసింది. దాదాపుగా 10 సంవత్సరాలుగా ఆ ఇంట్లోనే నివసిస్తున్న దిమిత్రీ దంపతులు తమకు తెలుసని పొరుగునే ఉన్న ఓ దుకాణదారు తెలిపారు. తమ దుకాణానికి తరచూ వచ్చే దిమిత్రీ దగ్గర నుంచి ఓ రకమైన వింతవాసన వచ్చేదని చెప్పారు.