ప్రజాసేవే సంకల్పంగా ప్రధాని మోదీ పార్టీ నేతలకు ప్రోత్సాహం

SMTV Desk 2017-09-26 17:59:03  Indian Prime Minister Narendra Modi, NDA Sarkar, Arun jaitli

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 26 : భాజపా జాతీయ సమావేశాలను ఉద్దేశించి ప్రసంగించిన భారత ప్రధాని నరేంద్ర మోదీ ఎన్డీయే సర్కార్ ప్రాధాన్యాలను వివరిస్తూనే, విపక్షాల విమర్శలకు ధీటుగా బదులిచ్చారు. ఈ సమావేశాల్లో 13 మంది భాజపా ముఖ్యమంత్రులు, ఆరుగురు ఉపముఖ్యమంత్రులు, 60 మందికిపైగా కేంద్ర మంత్రులు పార్టీ ఎంపీలు, ఎమ్మేల్యేలతో పాటు ఇతర ముఖ్య నేతలు పాల్గొన్నారు. పెద్దనోట్ల రద్దును, మందగించిన ఆర్థిక వ్యవస్థపైన విపక్షాలు చేస్తున్న ఆరోపణలను మోదీ కొట్టి పారేశారు. అవినీతిపై తనది రాజీలేని పోరాటమని ఆయన స్పష్టం చేశారు. నల్లధనం, అవినీతికి వ్యతిరేకంగా గత యూపీఏ సర్కార్ ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదని, అది వారి అజెండాలోనే లేదని ఆరోపించారు. వాటిపై తమ ప్రభుత్వం పోరాటం ప్రారంభిస్తే కాంగ్రెస్ నేతలకు మింగుడుపడటం లేదని మోదీ హెద్దెవ చేశారు. విపక్షాలకు అధికారం అనేది అనుభవించడానికి మాత్రమే ఒక్క సాధనమని విమర్శించిన ప్రధాని, తమకు ఈ అధికారం ప్రజాసేవ కోసమేనని వివరించినట్లు ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ పేర్కొన్నారు. ప్రజల ఆశలు, ఆకాంక్షలే ఎన్డీయే ప్రభుత్వ కీలక ప్రాధాన్యంశాలని, ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం సహా, వాటి పరిష్కారం విషయంలో అనుసంధాన కర్తలుగా వ్యవహరించాలని భాజపా శ్రేణులకు సూచించారు. భాజపా ఆరు సూత్రాల అజెండాను ఆమోదించింది. 2022 నాటికి నవభారత నిర్మాణాన్ని సాకారం చేయాలన్న ప్రధాని మోదీ సంకల్పం మేరకు ఎన్డీయే ప్రభుత్వం దేశంలో పేదరికం, ఉగ్రవాదం, కుల మతతత్వం, అవినీతి నిర్మూలన లక్ష్యాలుగా నిర్దేశించుకుంది.