బాలి ద్వీపంలో రగులుతున్న అగ్నిపర్వతం

SMTV Desk 2017-09-26 15:53:09  Volcano, On the island of Bali, indoneshiya

రంగసేం, సెప్టెంబర్ 26 : కొన్ని ఏళ్ల తరువాత బాలి ద్వీపంలోని కౌటా పర్యటక ప్రాంతానికి 75 కి.మీ. దూరంలో ఉన్న ఓ అగ్నిపర్వతం నుంచి, మళ్లీ ముంచుకొస్తున్న ప్రమాదం ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తుంది. ‘మౌంట్‌ ఏజుంగ్‌’గా పిలువబడే ఈ అగ్నిపర్వతం చివరిసారిగా 1963లో విస్ఫోటనం చెందగా, ఆనాడు పది వేల మందికిపైగా మృత్యువాతపడ్డారు. అనంతరం ఈ ఏడాది ఆగస్టు నుంచి మళ్లీ ఇది భారీ శబ్దాలు చేసి ప్రజల గుండెల్లో గుబులు పుట్టిస్తోంది. ముప్పు పొంచివున్న ప్రాంత పరిధిలో 60 వేల మంది వరకు నివసిస్తున్నారని, వీరిలో 48,540 మంది ఇళ్లను వదిలి వచ్చేశారని ఇండోనేసియా విపత్తు ప్రతిస్పందన సంస్థ(డీఎంఏ) తెలిపింది. ‘కొంతమంది మాత్రం ముప్పు పొంచివున్నాఆ ప్రాంతాలను వదిలిపెట్టడంలేదు. వీరిలో కొందరు విస్ఫోటనం మొదలుకాకముందే ఎందుకు వెళ్లిపోదామని భావిస్తుంటే.. మరికొందరు పశు సంపద గురించి ఆందోళన పడుతున్నారు’ అని డీఎంఏ అధికార ప్రతినిధి పూర్వో న్యూగ్రహో తెలిపారు. ఈ అగ్నిపర్వతం రోజురోజుకీ మరింత క్రియాశీలంగా మారుతుండటంతో, గత శుక్రవారం తీవ్రస్థాయి ముప్పు హెచ్చరికలు జారీచేశారు. అగ్నిపర్వత ముఖద్వారం నుంచి తొమ్మిది కిలోమీటర్ల పరిధి ప్రాంతంలో ఎవరూ ఉండకూడదని ఆదేశించారు. ప్రస్తుతం తరలివస్తున్న స్థానికుల కోసం తాత్కాలిక శిబిరాలు ఏర్పాటు చేశామని, కొందరు తమ బంధువుల ఇళ్లకు వెళ్తున్నారని అధికారులు తెలిపారు.