నేడు శ్రీ మహాలక్ష్మీదేవిగా దర్శనమిస్తున్న దుర్గమ్మ

SMTV Desk 2017-09-26 12:15:03  vijayawada kanakadhurgamma, dessara celebrations 6th day sri mahalakshmi devi

విజయవాడ, సెప్టెంబర్ 26 : బెజవాడ ఇంద్రకీలాద్రి పై కనకదుర్గమ్మ దసరా శరనవరాత్రోత్సవాలు దేదిప్యమానంగా జరుగుతున్నాయి. సోమవారం లలితత్రిపుర సుందరీదేవిగా దర్శనం ఇచ్చిన దుర్గమ్మ, ఆరోరోజైన నేడు ఆశ్వయుజ శుద్ధ షష్ఠిన గులాబీ వర్ణపు చీరతో శ్రీమహాలక్ష్మీ దేవి అవతారంలో భక్తులకు అభయ ప్రధానం చేస్తున్నారు. పద్మంపై ఆసన్నురాలైన జగన్మాత కరకమలం నుంచి కనకవర్షాన్ని కురిపిస్తున్న రూపాన్ని దర్శిస్తే భక్తులకు అష్టఐశ్వర్యాలు సిద్ధిస్తాయని నమ్మకం. అందుకే మహాలక్ష్మీదేవి అవతారానికి ఎంతో ప్రాధాన్యత ఉంటుందని పండితులు చెబుతున్నారు. అమ్మవారి సన్నిధిలో మంగళవాయిద్యాల హోరు.. సాంస్కృతిక కార్యక్రమాల జోరు.. కుంకుమార్చన.. చండీయాగాలతో ఆధ్యాత్మికత ఉట్టిపడుతోంది. దీంతో పెద్ద సంఖ్యలో తరలివస్తున్న భక్తులకు ఎలాంటి ఇబ్బందులు పడకుండా అన్ని ఏర్పాట్లు చేశామని ఆలయ అధికారులు వెల్లడించారు.