కేసీఆర్ వలసవాదేగా..? : రేవంత్ రెడ్డి

SMTV Desk 2017-09-26 12:14:46  Telangana Chief Minister, KCR, TDP President Revantreddy.

హైదరాబాద్, సెప్టెంబర్ 26 : ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణకు చెందిన వ్యక్తేనా..? ఆయన వలసవాది కాదా.! అంటూ తెదేపా కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. ఇటీవల గొత్తికోయలపై అటవీ శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ నేపధ్యంలో రేవంత్ రెడ్డి పార్టీ నేతలతో కలిసి జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో పర్యటించి, అటవీశాఖ అధికారులు చేసిన దాడుల తీరును అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అడవి తల్లిని నమ్ముకొని జీవన౦ సాగిస్తున్న గొత్తికోయలపై అమానుషంగా దాడులు నిర్వహి౦చి వారిని అక్కడి నుండి వెళ్లగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్ పూర్వీకులు బీహార్ నుంచి విజయనగరానికి, ఆ తరువాత తెలంగాణకు వలస వచ్చారని గుర్తు చేశారు. ఆయన కొడుకు కూడా గుంటూరులో చదువుకొని అమెరికాకు వెళ్లాడన్నారు. అడవినే నమ్ముకొని జీవించే గిరిజనులను ఇక్కడి నుండి వెళ్లగొట్టే హక్కు ఎవరికి లేదని రేవంత్ స్పష్టం చేసారు. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ఈ విషయం గురించి తప్పకుండా చర్చించి వారికి న్యాయం చేసే౦దుకు ప్రయత్నం చేస్తానని వెల్లడించారు.