ఐఎంఈఐ నంబరు మారిస్తే జైలుశిక్ష...

SMTV Desk 2017-09-25 12:29:36  IMEI Number, mobile number, International Mobile Industry Association, GSMA.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 25 : ప్రతి మొబైల్ ఫోనుకు ఒక ప్రత్యేకమైన గుర్తింపు సంఖ్య ఐఎంఈఐ (అంతర్జాతీయ మొబైల్ పరికరం గుర్తింపు నంబరు)ఉంటుంది. ఒకవేళ ఎవరైనా ఆ నంబర్ మార్చి కొత్తది ఏర్పాటు చేసుకుంటే ప్రభుత్వం వారిని శిక్షార్హుడిగా పరిగణి౦చాలని నిర్ణయించింది. ఇటీవల జరుగుతున్న దొంగతనాలను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. నిందితులుగా తేలిన వారికి మూడేళ్ళ జైలు శిక్షతో పాటు, జరిమానా కూడా విధించనున్నారు. ప్రతి సెల్‌ఫోన్‌కు 15 అంకెలతో కూడిన ఐఎంఈఐ నంబరును అంతర్జాతీయ మొబైల్‌ పరిశ్రమ సంఘం జీఎస్‌ఎంఏ జారీ చేస్తుంది. ప్రతి ఒక్క మొబైల్ కు ఈ నంబరు వేరువేరుగా, ప్రత్యేకంగా ఉంటుంది. ఫోనులో ఏదైనా సిమ్‌కార్డ్‌ వేసి కాల్‌ చేసినప్పుడు కనెక్షన్‌ న౦బరుతో పాటు ఏ సెల్‌ఫోన్‌ నుంచి వచ్చిందో కూడా తెలుసుకునేందుకు వీలుగా ఈ సంఖ్య ఉపయోగ పడుతుంది. సెల్‌ఫోన్‌ను దొంగిలించిన వారు సాంకేతికత సాయంతో ఐఎంఈఐ న౦బరును మారుస్తు౦డడంతో పోయిన ఫోనును గుర్తించడానికి వీలు కావడం లేదు. ఒక్క తయారీ సంస్థ మినహా మరే వ్యక్తి ఈ నంబరును మార్చినా, అంకెల్లో సవరణలు లాంటివి చేసిన వాటిని తీవ్ర నేరాలుగా పరిగణించి నిందితులకు శిక్ష విధించనున్నారు. అంతేకాదు ఇకపై అపహరణకు గురైన ఫోనుకు.. ఐఎంఈఐ న౦బరు మార్చిన ఫోనుకు సర్వీసులను రద్దు చేసే దిశగా టెలికాం వ్యవస్థ అడుగులు వేస్తోంది.