విద్యుత్‌కు బ్యాంకింగ్‌ సదుపాయం అందుబాటులోకి రానుంది...

SMTV Desk 2017-09-25 09:58:57  power banking, tserc, discum,tariff ,telangana ,state,

హైదరాబాద్ : సొంత విద్యుత్ అవసరాల కోసం ఈ రోజుల్లో చాలా మంది పారిశ్రామికవేత్తలు కాప్టివ్‌ సౌర, పవన, మినీ హైడల్‌ విద్యుత్‌ ప్లాంట్లను ఏర్పాటు చేసుకుంటున్నాయి, అలాగే గృహ అవసరాల కోసం సోలార్‌ రూఫ్‌ టాప్‌ ప్లాంట్లను ఏర్పాటు చేసి విద్యుత్ ను వినియోగించుకునే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్నాయి. అయితే, ఈ ప్లాంట్ద్వారా ఉత్పత్తి అవుతున్న విద్యుత్‌ను తమ సొంత అవసరాలకు వినియోగించుకోగా, మిగిలిన విద్యుత్‌నువృథాగా వదిలేయక తప్పడం లేదు. ఇందుకోసం తెలంగాణ విద్యుత్ పంపిణి సంస్థ(డిస్కం)లు విద్యుత్ బ్యాంకింగ్ సదుపాయాన్ని కల్పించేందుకు ఏర్పాట్లను చేయబోతున్నట్లు సమాచారం. మనం డబ్బును బ్యాంకుల్లో జమ చేసి అవసరమైనప్పుడు ఎలా వెనక్కి తీసుకుని వాడుకుంటామో అలాగే మనం సోలార్‌ రూఫ్‌ టాప్‌ ప్లాంట్ల ద్వార ఉత్పత్తి చేసుకున్న విద్యుత్ ను డిస్కంలకు ఇచ్చి అవసరమైనప్పుడు మరల వెనక్కు తీసుకునే వెసులుబాటు కలగనుంది. ప్రధానంగా పగటి వేళల్లోనే సౌర విద్యుదుత్పత్తికి అవకాశముండనుంది. ఈ సమయంలో అవసరాలకు మించి ఉత్పత్తి చేసిన విద్యుత్‌ను డిస్కంలకు పంపించి, మళ్లీ సౌర విద్యుదుత్పత్తికి ఆస్కారం లేని రాత్రి వేళల్లో ఇంతే పరిమాణంలో డిస్కంల నుంచి వెనక్కి తీసుకోవడానికి అవకాశం వస్తుంది. విద్యుత్‌ బ్యాంకింగ్‌ సదుపాయం కల్పించినందుకు డిస్కంలు సదరు ప్లాంట్ల యజమానుల నుంచి బ్యాంకింగ్‌ చార్జీలతో పాటు మరికొన్ని రకాల సుంకాలు, పన్నులు వసూలు చేయనున్నాయి. పవర్‌ బ్యాంకింగ్‌ సదుపాయం పొందేందుకు డిస్కంలతో విద్యుత్‌ ప్లాంట్‌ యజమానులు విద్యుత్‌ బ్యాంకింగ్‌కు సంబంధించిన ఒప్పందాన్ని కుదుర్చుకోవాల్సి ఉంటుంది. ఒప్పందంపై వచ్చే నెల 5 వరకు రాష్ట్ర విద్యుత్‌ నియంత్రణ మండలి(టీఎస్‌ఈఆర్సీ) ప్రజల నుంచి అభిప్రాయాలు, సలహాలు సేకరిస్తుంది. ఈ ఒప్పందాన్ని ఈఆర్సీ ఆమోదిస్తే విద్యుత్‌ బ్యాంకింగ్‌ సదుపాయం అమల్లోకి వస్తుంది.