పేదవాడికి ఇల్లు, రైతుల ఆదాయం రెట్టింపు: మోదీ

SMTV Desk 2017-09-24 11:56:49  varanasi, narendra modi, prime minister of india,

వారణాసి, సెప్టెంబర్ 24: దేశాభివృద్ధికే తమ తొలి ప్రాధాన్యమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. ఓట్ల కోసం రాజకీయలు చేసేవారికి బీజేపీ బిన్న సంస్కృతిగా నిలుస్తుందని మోదీ తెలిపారు. ఉత్తర ప్రదేశ్ లోని తన సొంత నియోజవర్గమైన వారణాసిలో మోదీ పర్యటించారు. రెండు రోజుల పర్యటనకు శుక్రవారం వారణాసికి వచ్చిన ప్రధాని తొలి రోజు రూ.1000 కోట్లు విలువైన 17 ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. శనివారం షెషన్‌షాపూర్‌లో స్వచ్ఛ భారత్‌ అభియాన్‌ కార్యక్రమంలో భాగంగా అరవింద్‌ అనే కూలీ ఇంటిలో మరుగుదొడ్డికి ప్రధాని స్వయంగా శంకుస్థాపన చేశారు. అనంతరం 1800 ఎకరాల్లో ఏర్పాటు చేసిన పశు ఆరోగ్య మెగా మేళాను ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ బహిరంగ సభలో మాట్లాడారు. మరుగుదొడ్డికి ‘ఇజ్జత్‌ ఘర్‌’(గౌరవాన్ని కలిగించే ఇల్లు) అని పేరు ఖరారు చేసిన యూపీ సర్కార్‌ను అభినందిస్తున్నానని ప్రధాని పేర్కొన్నారు. పరిశుభ్రత అనేది తన దృష్టిలో ఓ పవిత్రమైన కార్యక్రమమని, పేదలకు సేవ చేసే మార్గమని అన్నారు. పేదల కోసం మరుగుదొడ్లను నిర్మించే అవకాశం రావడం తన అదృష్టంగా భావిస్తున్నానన్నారు. ‘భారతదేశం 2022లో 75వ స్వాతంత్య్రదినోత్సవ వేడుకలను జరుపుకోనుంది. అప్పటికి దేశంలోని ప్రతి పేదవాడికి సొంత ఇల్లు ఏర్పాటు చేస్తాం’ అని మోదీ హామీ ఇచ్చారు. ఆనాటికి దేశంలోని రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని భరోసా ఇచ్చారు. రైతుల ఆదాయం పెరగడ౦ మాత్రమే కాకుండా మొత్తంగా జాతీయ ఆదాయం పెరుగుతుందని పేర్కొన్నారు.