దసరా రద్దీ కారణంగా... ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు

SMTV Desk 2017-09-24 11:33:22  dasara festival sesion, RTC special busses, Hyderabad routes.

హైదరాబాద్, సెప్టెంబర్ 24 : అసలే దసరా పండగ సీజన్.. ఈ హైదరాబాద్ లో ఎక్కడ చూసిన బస్సులన్ని కిక్కిరిసిపోయి దర్శనమిస్తున్నాయి. దీనికి తోడు ఏ బస్సు ఎక్కడి నుండి బయలుదేరుతుందో అని ప్రయాణికులు గందరగోళానికి గురవుతున్నారు. దీనికి అధికారులు స్పందించి పరిష్కార మార్గం దిశగా అడుగులు వేశారు. దసరా రద్దీని దృష్టిలో ఉంచుకొని హైదరాబాద్ నగర శివార్ల నుంచే బస్సులు గమ్యస్థానాలకు బయలుదేరుతాయని స్పష్టం చేశారు. ప్రజలు దీనిని గమనించి పూర్తి సమాచారాన్ని ముందుగానే తెలుసుకొని ప్రయాణించాలని సూచించారు. ఇంతకు ముందు బస్సులన్ని ప్రధాన బస్టాండైన ఎంజీబీఎస్ కు వచ్చేవని.. ఇప్పుడు పండగ సీజన్ కావడంతో నగర శివార్లకు మార్చినట్లు వెల్లడించారు. ఈ బస్సులన్ని కేపీహెచ్బీ కాలని, బీహెచ్ఈఎల్ ప్రాంతం నుండి బయలుదేరే బస్సులు తార్నాక లేదా అత్తాపూర్ మీదుగా ఎల్బీనగర్ చేరతాయి. వరంగల్ రూట్ బస్సులు ఉప్పల్ బస్టాండు నుండి.. నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్ రూట్ బస్సులు జూబ్లీ బస్ స్టేషన్ నుండి బయలుదేరతాయి. ఒంగోలు, నెల్లూరు, కడప, కర్నూలు, అనంతపురం, తిరుపతి, చెన్నై, బెంగళూరు తదితర ప్రాంతాలకు ఎంజీబీఎస్ ఎదురుగా ఉండే పాత బస్టాండ్ (సీబీఎస్) నుండి బయలుదేరుతాయని స్పష్టం చేసారు. ఇక మిర్యాలగూడ, నల్గొండ ప్రాంతాలకు దిల్ సుఖ్ నగర్ బస్టాండ్ నుండి బస్సులు బయలుదేరుతాయి. ఈ సమాచారాన్ని ఎప్పటికప్పుడు ప్రయాణికులకు అందించడం కోసం ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేశామని అధికారులు పేర్కొన్నారు.