రెండు ఆకుల గుర్తు ఏ వర్గానికి... ఈసీ

SMTV Desk 2017-09-23 19:03:22  AIADMK , Election Commission, Sasikala, Paneer Selvam, Palani Swamy

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 23 : అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి పదవి నుంచి శశికళ తొలగింపు సహా ఇటీవల సర్వసభ్య సమావేశంలో తీసుకున్న వేర్వేరు నిర్ణయాల్ని ఆ పార్టీ ఎన్నికల సంఘానికి నివేదించింది. ఢిల్లీలో ఈసీ అధికారుల్ని కలిసిన ఆ పార్టీ నేతల బృందం పళని స్వామి, పన్నీర్ సెల్వం వర్గాలు విలీనమైనట్లు తెలిపింది. ఈ నెల 12న చెన్నైలో జరిగిన సర్వసభ్య సమావేశంలో చేసిన తీర్మానాన్ని ఈసీకి నివేదించిన పార్టీ నేతలు ఆయా నిర్ణయాలు చెల్లవన్న దినకరన్ వర్గం వాదనను తోసిపుచ్చారు. మరోవైపు అన్నాడీఎంకే ఎన్నికల చిహ్నమైన రెండు ఆకుల గుర్తు ఎవరికీ దక్కుతుందన్న అంశంపై అక్టోబర్ 5న వాదనలు వింటామని ఎన్నికల సంఘం తెలిపింది. శశికళ, పన్నీర్ సెల్వం మధ్య వివాదం దృష్ట్యా రెండు ఆకుల గుర్తును గతంలో స్తంభింప జేసిన ఈసీ ఈ వ్యవహారంలో మరోమారు ప్రమాణ పత్రాలు సమర్పించారని ఆదేశించింది. ఇందుకోసం శశికళ, పన్నీర్ సెల్వం వర్గాలకు ఈ నెల 29 వరకు గడువు ఇచ్చింది.