అట్టహాసంగా ప్రారంభమైన తితిదే బ్రహ్మోత్సవాలు...

SMTV Desk 2017-09-23 18:38:19  thirupathi, TTD, Srivenkatesvarasvami Brahmotsavam,

తిరుపతి, సెప్టెంబర్ 23: తిరుధామం..అంతుబట్టని రహస్యాల ఆరామం.. శ్రీవేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలకు శుక్రవారం తితిదే శ్రీకారం చుట్టారు. తొమ్మిది రోజుల పాటు జరిగే ఈ బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని దేవస్థానం తిరుమల క్షేత్రాన్ని అంగరంగ వైభవంగా విద్యుద్దీపాలతో, విరుల తోరణాలతో అలకరించింది. శనివారం సాయంత్రం ధ్వజారోహణంతో పూర్తి స్థాయిలో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. శనివారం నుంచి అక్టోబరు ఒకటో తేదీ వరకు ఉదయం, రాత్రి వేళల్లో స్వామి వారికి వాహన సేవలు జరగనున్నాయి. బ్రహ్మోత్సవాల అంకురార్పణలో భాగంగా.. శ్రీవారి సేనాధిపతి విష్వక్సేనుడు దేవాలయానికి నైరుతి వైపు వసంత మండపానికి శ్వేతచ్ఛత్రచామర మంగళవాద్యాలతో ఊరేగింపుగా వచ్చారు. ఈ వేడుకలను తిలకించేందుకు తరలివచ్చే భక్తకోటి కోసం దేవస్థానం విస్తృత ఏర్పాట్లు చేసింది. శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించడానికి శనివారం సాయంత్రం 6.40కి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సతీసమేతంగా తిరుమలకు చేరుకోనున్నారు. పట్టువస్త్రాలు సమర్పించి పెద్దశేష వాహన సేవలో దంపతులు పాల్గొంటారు.