మోదీకి అభినందనలు తెలిపిన విరాట్ కోహ్లీ..

SMTV Desk 2017-09-22 13:24:25  Sports, Khelo India, Virat Kohli, Central Sports Minister, Rajyavardhan Singh Rathod

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 22 : క్రీడలకు అవసరమైన మౌలిక వసతులను మెరుగు పరచడం కోసం కేంద్ర ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. కేంద్ర క్రీడా శాఖ మంత్రి రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ "ఖేలో ఇండియా" అనే ప్రతిష్టాత్మకమైన కార్యక్రమాన్ని సెప్టెంబర్ 27 వ తేదీన ప్రారంభించనున్నారు. గతంలో ఉన్న రాజీవ్ గాంధీ ఖేల్ అభియాన్, అర్బన్ స్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్కీమ్, నేషనల్ స్పోర్ట్స్ టాలెంట్ సెర్చ్ ప్రోగ్రామ్ లను అనుసంధానిస్తూ.. దీని పరిధిని మరింత విస్తరించారు. క్రీడలకు సంబంధించి అన్ని రకాలుగా అభివృద్ధిని సాధించే దిశగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా మూడేళ్ల కాలానికి గాను రూ. 1,756 కోట్ల బడ్జెట్ ను క్రీడలకు కేటాయించింది. అంతేకాకుండా దేశంలో ఉన్న 20 విశ్వవిద్యాలయాలను క్రీడా హబ్ లుగా మార్చనున్నట్లు సమాచారం. ఈ సందర్భంగా కేంద్రం తీసుకున్న నిర్ణయంపై టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మాట్లాడుతూ.. "ఇది ఒక శుభపరిణామం, ఈ కార్యక్రమం చాలా అద్భుతమైనదేకాక క్రీడా రంగానికి "ఖేలో ఇండియా" ఎంతో దోహదం చేస్తుందని ప్రశంసించాడు. క్రీడల అభివృద్ధికి పాటుపడుతున్న ప్రధాని మోదీ, క్రీడల మంత్రి రాథోడ్ లకు నా అభినందనలు" అని ట్వీట్ చేశాడు.