ఆ బ్యాంకు చెక్కులు చెల్లవు...ఎస్.బి.ఐ

SMTV Desk 2017-09-22 09:49:04  sbi, chekbooks, ifscode,

ఢిల్లీ : స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా తమ ఖాతాదారులకు కీలక సూచన చేసింది. ఇటీవల ఎస్.బి.ఐ లో విలీనమైన ఆరు బ్యాంకులకు చెందిన ఖాతాదారుల పాత చెక్‌బుక్‌లు, ఐఎఫ్‌ఎస్‌ కోడ్‌లు సెప్టెంబర్‌ 30 నుంచి చెల్లబోవని తెలిపింది. ఈ ఏడాది ఆరంభంలో స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ హైదరాబాద్‌, స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ పాటియాలా, స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ బికనేర్‌ అండ్‌ జైపూర్‌, స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ రాయ్‌పూర్‌, స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ట్రావెన్‌కోర్‌ సహా భారతీయ మహిళా బ్యాంకులు ఎస్.బి.ఐ లో విలీనమైన విషయం తెలిసిందే. అయితే ఈ అనుబంధ బ్యాంకుల్లోని ఖాతాదారులు ఇప్పటికీ పాత చెక్‌బుక్‌లనే వాడుతున్నారు. ఈ నేపథ్యంలో సెప్టెంబర్‌ 30 నుంచి ఆ పాత చెక్‌బుక్‌లతో పాటు ఐఎఫ్‌ఎస్‌ కోడ్‌లు పనిచేయబోవని తెలిపింది. సదరు బ్యాంకు ఖాతాదారులు వెంటనే కొత్త చెక్‌బుక్‌ల కోసం దరఖాస్తు చేసుకోవాలని, అలాగే కొత్త ఐఎఫ్‌ఎస్‌ కోడ్‌లు కూడా పొందాలని స్పష్టం చేసింది. ఇంటర్నెట్‌, మొబైల్‌ బ్యాకింగ్‌, ఏటీఎం లేదా సొంత బ్యాంకు బ్రాంచీల నుంచి ఈ కొత్త చెక్‌బుక్‌లను తీసుకోవచ్చని ఈ మేరకు ట్విటర్‌ ద్వారా తెలియజేసింది.