ఏపీ గ్రూప్‌-2 నియామక ప్రక్రియ నిలిపివేత

SMTV Desk 2017-09-21 10:47:16  appsc, appsc group2, apat, group 2 notification

హైదరాబాద్ సెప్టెంబర్ 21: గ్రూప్ 2 నియామక ప్రక్రియ చేపట్టవద్దని ఏపీపీఎస్సీని ఆంధ్రప్రదేశ్ పరిపాలనా ట్రైబ్యునల్ ఆదేశిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. ఏపిఏటి సభ్యులు ఎం.విజయకుమార్ ఈ మేరకు బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. జులై 15,16 తేదిల్లో జరిగిన గ్రూప్-2 ప్రధాన పరీక్షలో అక్రమాలు జరిగాయని పేర్కొంటూ అభ్యర్దులు కిరణ్ కుమార్, సుధీర్ లు ఏపిఏటిని ఆశ్రయించారు. బుధవారం ఈ వ్యాజ్యం మరో సారి విచారణకు రాగ ప్రమాణపత్రం దాఖలు చేయడానికి గడువు కోరిన ఏపీపీఎస్సీ సిసి పుటేజ్ ను సైతం సమర్పించలేదు. పిటిషనర్ ల తరుపు న్యాయవాది వెంకట రావు వాదనలు వినిపిస్తూ ప్రశ్నపత్రానికి చెందిన ఫోటోలు(స్క్రీన్ షాట్స్) బయటకు వచ్చాయన్నారు. కొన్ని పరీక్ష కేంద్రాలలో రాత్రి పది గంటల వరకు పరీక్ష నిర్వహించారన్నారు. అక్టోబర్ నెలాఖరుకు గ్రూప్ 2 నియామకాలు పూర్తి చేయాలని ఏపీపీఎస్సీ భావిస్తున్నట్లు ట్రైబ్యునల్ దృష్టికి తీసుకువచ్చారు. వాదనలను పరిగణలోకి తీసుకున్న ట్రైబ్యునల్ సభ్యులు నియామక ప్రక్రియను నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీచేశారు. తదుపరి ఉత్తర్వులు వచ్చేంత వరకు నియామక ప్రక్రియ చేపట్టవద్దని స్పష్టంచేశారు.