వర్ష ధాటికి అతలాకుతలం అవుతున్న ముంబై

SMTV Desk 2017-09-20 15:53:13  Mumbai, rain, railway, airport

ముంబై, సెప్టెంబర్ 20 : ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో దేశ వాణిజ్య రాజధాని ముంబై జలమయమైంది. కుండపోత వానలకు అనేక ప్రాంతాలు నీట మునిగిపోగా ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పలు రైలు సర్వీసులకు కూడా ఇదే పరిస్థితి ఎదురవుతుంది. మరికొన్ని గంటల్లో ముంబై, కొంకన్ ప్రాంతాలు సహా ఉత్తర, మధ్య మహారాష్ట్రలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ హెచ్చరికలతో అప్రమతమైన మహారాష్ట్ర ప్రభుత్వం ముందు జాగ్రత్తగా ముంబైలో నేడు అన్ని విద్యా సంస్థలకు సెలవు ప్రకటించింది. భారీ వర్షాల ధాటికి ముంబై ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయంలో రన్ వే తడిగా మారగా, స్పేస్ జెట్ విమానానికి పెను ప్రమాదం తప్పింది. వారణాసి నుంచి 183 మందితో వచ్చిన విమానం ల్యాండ్ అవుతున్న సమయంలో రన్ వే నుంచి పక్కకు జారీ మట్టిలో కూరుకుపోయింది. వెంటనే అప్రమతమైన సిబ్బంది ప్రయాణికులను అత్యవసర మార్గం నుంచి బయటకు రప్పించారు. ఈ ఘటనతో ముంబైలో విమాన రాకపోకలకు స్వల్ప అంతరాయం ఏర్పడింది.