చెరువులను మింగేస్తున్నారు...

SMTV Desk 2017-09-20 14:32:47  Hyderabad, HMDA, GHMC, Apartments in Hyderabad

హైదరాబాద్, సెప్టెంబర్ 20: నగరంలో అధికారుల నిర్లక్ష్యం వల్ల చెరువు తీర ప్రాంతాల్లో అక్రమ కట్టడాలు వెలుస్తున్నాయి. బల్దియా పరిధిలో ఉన్న చెరువు ప్రాంతాలలో దాదాపు అన్నీ అక్రమణకు గురైనట్లు అధికారిక లెక్కలు తెలుపుతున్నాయి. ఇటీవల కాలంలో అధికారులు పైరవీలకు పాల్పడుతూ అక్రమ కట్టడాలకు అనుమతిలివ్వడంతో చెరువుల పరిసర ప్రాంతాల్లో కూడా భవంతులు వెలుస్తున్న సంగతి తెలిసిందే. దీంతో అనేక చెరువులు వాటి రూపు కోల్పోయి చిన్నపాటి గుంతల్లా మారిన వైనాలు అనేకం చోటు చేసుకుంటున్నాయి. అప్పటి హుడా మాత్రమే కాదు ఇప్పటి హెచ్‌ఎండీ కూడా ఇష్టారాజ్యంగా అనుమతిలిచ్చినట్లు తెలుస్తోంది. హైటెక్ సిటీ సమీపంలోని దుర్గం చెరువుతో పాటు మల్కాజ్ గిరి చెరువు, కాప్రా చెరువు ప్రాంతాల్లో నిర్మించిన అక్రమ కట్టడాలే దీనికి ప్రత్యక్ష నిదర్శనం గా చెప్పవచ్చు. దీనికి ప్రధాన కారణంగా చెరువుల పూర్తి నిల్వ సామర్థ్యం లెక్కలు సరిగ్గా లేకపోవడం అని తెలుస్తున్నా అదే అదనుగా ప్రభుత్వ అధికారులు అవినీతి కొమ్ము కాస్తున్నారనే భావన అందరిలో కలుగుతుంది. అయితే హైకోర్టు ఉత్తర్వుల మేర సాగునీటి అధికారులు తాజగా పేర్కొన్న చెరువుల పూర్తి నిల్వ సామర్థ్యం ఆధారంగా నగరంలో పలు చోట్ల రెండు కాలనీల నుండి ఐదారు కాలనీల వరకు చెరువుల పరిధిలోకి వస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. దీనికి సంబంధించి పలు కాలనీలకు ఇప్పటికే సమన్లు జారీ చేసినట్లు అధికారులు తెలిపారు. ఇలా చెరువులు అక్రమణకు గురికావడం వలన భూగర్భ జలాలు ఇంకిపోవడమే కాకుండా తాగునీటి సమస్య మరింత చోటు చేసుకునే ప్రమాదం ఉందటూ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.