విషపు కోరల్లో యువత... అసలు కారణం ఏమిటి?

SMTV Desk 2017-09-19 13:54:13  Youth, Teenagers, Police, Youth Crime, Pubs

హైదరాబాద్, సెప్టెంబర్ 19: ప్రస్తుతం సమాజంలో యువత దేశాభివృద్ధికి పాటుపడుతుందని ఆనందపడాలో లేక పాశ్చత్య పోకడలకుపోతూ, నేర ప్రవృత్తి వైపు ఆకర్షితులౌతున్నారని విచారించాలో తేల్చుకోలేని అగమ్యగోచర పరిస్థితి నెలకొంది. రోజురోజుకీ యువతలో ఈ విపరీత ధోరణి పలు వైపరిత్యాలకు తావుతీస్తుంది. కారణాలు చిన్నవే అయిన ఘోర నేరాలకు నాంది పలుకుతున్నారు. మైదానంలో ఆడుకుంటూ స్కోరులో తప్పు దొర్లిందని ఒకరు, తనకు వ్యతిరేకంగా మాట్లాడుతూ, తన ప్రేమకు అంగీకారం తెలపలేదని మరొకరు ఇలా చిన్న చిన్న విషయాలకు యువత పేడదారిన పడుతున్నారు. అంతేకాకుండా తనపై ఫిర్యాదు చేశారని, అవసరానికి డబ్బు చేతికి ఇవ్వలేదని.. ఇలా కారణం ఏదైనప్పటికీ వారిని అడ్డు తొలగించుకోవడమే సమస్యకు పరిష్కారంగా ఇంతటి నేరాలకు పాల్పడుతున్నారు. ఈ మధ్య కాలంలో తెలుగు రాష్ట్రాలలో నమోదైన 90శాతం నేరాలు.. యువకులు చేసినవే అని పోలీసు అధికారులు తెలుపుతున్నారు. కాగా, నేరాలకు పాల్పడుతున్న యువతలో అధికంగా కొత్త వ్యక్తులే ఉండడం గమనార్హం. అయితే ఇలాంటి నేరపూరిత పరిష్కార మార్గాల దిశగా యువత అడుగులు వేయడానికి సైతం కారణాలు లేకపోలేదు. వారి పెరిగే వాతావరణం, అతి స్వేచ్చ, తల్లిదండ్రుల ఆప్యాయత కరువవ్వడం, బంధుత్వాల విలువలు తెలియపోవడం వంటివి ప్రధాన కారణాలుగా తెలుస్తున్నాయి. అంతేకాకుండా నేటితరం యువత నాగరికత ముసుగులో అవలంభిస్తున్న సాంకేతిక పోకడ కూడా మరొక ముఖ్య కారణంగా మానసిక విశ్లేషకులు పేర్కొంటున్నారు. యువతలో మొదలైన ఈ విపరీత ధోరణిలో మార్పు సాధ్యమా? వారి ఆలోచన శైళిని సక్రమ మార్గం వైపు నడిపించగలమా? వారిని సమాజం కోసం పాటుపడే మహోన్నత శక్తులుగా తీర్చిదిద్దగలమా? అంటే అవుననే సమాధానం మానసిక వేత్తల నుండి వినిపిస్తుంది. ముఖ్యంగా వారిలో మార్పు కోసం తల్లిదండ్రులు కృషి చేయాలని, పిల్లల నడవడికను ఎప్పుడు గమనిస్తుండాలని సూచిస్తున్నారు. వారిలో నైతిక విలువలు పెంపొందించాలని, నాగరికత పేరుతో కుటుంబ సభ్యులు యువతరం ముందు మద్యం సేవించడం వంటి అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడరాదని హితవు బోధిస్తున్నారు. భవిష్యత్తులో ఇదే పిల్లల్ని పెడదారి పెట్టిస్తుందని హెచ్చరిస్తున్నారు.