ఇక బహిరంగంగా తాగితే అంతే...

SMTV Desk 2017-09-18 18:10:34   Alcohol ban in public places in Goa, cm parrikar, licence cancel

పనాజీ, సెప్టెంబర్ 18 : గోవా అనగానే మనకు మొదట గుర్తొచ్చేది అక్కడి బీచ్. ఆ బీచ్ లో కూర్చొని అక్కడి అందాలను ఆస్వాదించాలని ఎవరికీ మాత్రం ఉండదు చెప్పండి. కాని కొంతమంది చేసే పనుల వల్ల సరదాగా గడపడానికి వెళ్లిన వారు నిరాశకు గురి కావలసివస్తోంది. గోవా బీచ్ లో మద్యం సేవించకుండా ఇప్పటికే అక్కడి ప్రభుత్వం నిషేధం విధించి౦ది. కానీ ఇంకా అక్కడ నుండి ఫిర్యాదులు మాత్రం వస్తూనే ఉన్నాయి. అసలు విషయం ఏంటంటే.. దేశ విదేశాల నుంచి భారీ సంఖ్యలో పర్యాటకులు సెలవులను గడిపేందుకు గోవా వస్తుంటారు. కాని సరదా పేరుతో కొంతమంది బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగడమే కాకుండా, తాగిన మైకంలో ప్రజలకు తీవ్ర ఇబ్బంది కలిగిస్తున్నారనే ఫిర్యాదులు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో గోవా ముఖ్యమంత్రి మనోహర్‌ పారికర్‌ బహిరంగ ప్రదేశాల్లో మద్యపానాన్ని నిషేధిస్తూ సంచలనాత్మకమైన నిర్ణయం తీసుకున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి పారికర్ మాట్లాడుతూ... "ఎవరికైనా మద్యం తాగాలనిపిస్తే లోపల కూర్చుని తాగండి. అంతేగాని బహిరంగ ప్రదేశాల్లో ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తే మాత్రం సహించేది లేదని అన్నారు. అధికారులందరితో ఈ విషయం గురించి ప్రత్యేకంగా చర్చించి ఇటువంటి చర్యలు జరగకుండా చర్యలు తీసుకుంటాం" అని పేర్కొన్నారు. ఒకవేళ మద్యం దుకాణాల వద్ద ఎవరినైనా తాగేందుకు అనుమతిస్తే కఠిన చర్యలు తప్పవని వారికి జరిమానా, లైసెన్స్‌ రద్దు చేయడం వంటి చర్యలు చేపడతామని హెచ్చరించారు.