మాల్యా ఆస్తులు స్వాధీనం చేసుకున్న ఈడీ

SMTV Desk 2017-09-18 14:57:55  Vijay Mally, Directorate Of Enforcement, Kingfisher

ముంబై, సెప్టెంబర్ 18: మనీలాండరింగ్‌ నిరోధ చట్టం కింద ఆరోపణలు ఎదుర్కొంటూ సుమారు పదిహేడు బ్యాంకులను మోసగించి రూ.9,000వేల కోట్ల అప్పులతో పరారైన బిజెనెస్‌ టైకూన్‌ విజయ్‌మాల్యాపై ప్రభుత్వం చర్యలు ముమ్మరం చేసింది. ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ మాల్యా ఆస్తుల స్వాధీనం దిశగా అడుగులు వేస్తోంది. యునైటెడ్‌ బ్రూవరీస్‌ సంస్థకు ఇప్పటికే సంబంధిత సమన్లు జారీ చేసింది. దీంతో ఈ కంపెనీలో మాల్యాకు చెందిన రూ.100 కోట్ల విలువైన వాటాలను స్టాక్‌ హోల్డింగ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా కేంద్ర ప్రభుత్వానికి బదిలీ చేయనుంది. అయితే సుమారు రూ.4,000 కోట్ల విలువైన షేర్లు కలిగిన యబీఎల్‌, యునైటెడ్‌ స్పిరిట్స్‌ లిమిటెడ్‌, మెక్‌డోవెల్స్‌ హోల్డింగ్స్‌ లిమిటెడ్‌లలోని షేర్లను కూడా స్వాధీనపరచుకునేందుకు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ సిద్ధమైంది. కాగా, ఈడీ ఇప్పటికే యూబీఎల్‌కు చెందిన 4 కోట్ల వాటాలు, యూఎస్‌ఎల్‌కు చెందిన 25.1లక్షల వాటాలు, మెక్‌డోవెల్స్‌ హోల్డింగ్స్‌లోని 22 లక్షల వాటాలను ఈ కేసులో అటాచ్‌ చేసింది. వీటితోపాటు మాల్యావిగా అనుమానిస్తున్న మరిన్ని కంపెనీలపై చర్యలు చేపట్టే యోచనలో ఈడీ ఉన్నట్లు సమాచారం. వీటిల్లో దేవీ ఇన్వెస్ట్‌మెంట్స్‌, కింగ్‌ఫిషర్‌ ఫిన్‌వెస్ట్‌ ఇండియా, మాల్యా ప్రైవేటు లిమిటెడ్‌, ఫార్మాట్రేడింగ్‌ కంపెనీ, విట్టల్‌ ఇన్వెస్ట్‌మెంట్స్‌, యునైటెడ్‌ బ్రూవరీస్‌ హోల్డింగ్‌ లిమిటెడ్‌, కామ్‌స్కో ఇండస్ట్రీస్‌, ది గెమ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ అండ్‌ ట్రేడింగ్‌ కంపెనీలపై కూడా కొరడా రుళిపించే అవకాశం లేకపోలేదు.