తెలంగాణ రాష్ట్రంలో ప్రబలుతున్న విష జ్వరాలు..!

SMTV Desk 2017-09-18 14:15:46  hyderabad, telagana districts, vishajvaralu

హైదరాబాద్, సెప్టెంబర్ 18: ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు అధికంగా కురుస్తుండటం తో గ్రామీణ ప్రజలు రోగాల బారిన పడుతున్నారు. గ్రామాల్లో నెలకొన్న నీటి కాలుష్యమే ఈ రోగాలకు ప్రధాన కారణంగా తెలుస్తుంది. ముఖ్యంగా మురుగు నీటి ప్రాంతాలలో విష జ్వరాలు ప్రబలడంతో తెలంగాణ ప్రభుత్వం నివారణ చర్యలు చేపట్టినా, అవి తాత్కాలికంగా ఉపశమనాన్ని మాత్రమే కలిగిస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో విషజ్వరాల బారిన పడుతున్న జ్వరపీడితుల సంఖ్య రోజురోజుకు గణనీయంగా పెరుగుతుంది. రాష్ట్రమంతటా డెంగీ, మలేరియా జ్వరాలు ప్రబలుతున్నాయి. గిరిజన ప్రాంతాలు ఎక్కువగా ఉండే... ఖమ్మం, కొత్తగూడె౦, భద్రాచలం, వరంగల్, ఆదిలాబాద్ తో పాటు పలు ప్రాంతాలలో ఎక్కువ సంఖ్యలో జ్వరపిడితులు నమోదవుతున్నారు. ఈ ఏడాదిలో ఇప్పటివరకు మలేరియా 2435, డెంగీ 1073, కేసులుగా నమోదయ్యాయినట్లు గుర్తించారు. డెంగీ జ్వరాలు అత్యధికంగా ఒక్క ఖమ్మం జిల్లాలోనే ఇప్పటివరకు (424), మలేరియా జ్వరాలు అత్యధికంగా భద్రాది-కొత్తగూడెంలో (472) గా నమోదయ్యాయి. ఈ విష జ్వరాలకు గురైన బాధితులతో రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులు అన్ని కిక్కిరిస్తున్నాయి. గ్రామీణ మిషన్ లో భాగంగా పలు అంశాల కోసం కేంద్రం నిధులను విడుదల చేసింది, అందులో భాగంగా రాష్ట్రానికి 2 లక్షల దోమతెరలను సరఫరా చేయాలని రాష్ట్ర ప్రభుత్వం గతంలోనే కోరింది. ఈ దోమ తెరలు ఇంకా రాష్ట్రానికి రాకపోవడమే కాగ నేషనల్ హెల్త్ మిషన్ కింద మంజూరుచేసిన నిధులను సకాలంలో వ్యయం చేయలేదంటూ కేంద్రం నిధులను నిలిపివేసింది. దీంతో గ్రామీణ సేవలపై తీవ్ర ప్రభావం పడుతోంది. ఈ కారణంగా కేంద్రంతో సంబంధం లేకుండా రాష్ట్ర ప్రభుత్వమే గ్రామీణ ప్రాంతాలకు అవసరమైన మందులు, రక్త పరీక్ష నిర్వహించేందుకు కిట్ ల సరఫరా, తగిన వైద్య సదుపాయాలు అందించినప్పటికీ, విష జ్వరాల బారిన పడుతున్న రోగుల సంఖ్య ఏ మాత్రం తగ్గడం లేదని తెలుస్తుంది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి గ్రామ స్థాయి అధికారులను అప్రమత్తం చేసి, మరి కొంత మంది ప్రత్యేక వైద్య నిపుణులచే నిరంతర పర్యవేక్షణ జరిపినట్లయితే ఆశించిన ఫలితాలు వస్తాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.