మూడో అతి పెద్ద ఆర్థిక శక్తిగా భారత్ అవతరించనుందా..?

SMTV Desk 2017-09-18 13:05:59  World economy, Japan, Germany, India, British brokerage firm HSBC

ముంబై, సెప్టెంబర్ 18 : ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత్ మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించనుంది. ఇటీవల కాలంలో కేంద్ర ప్రభుత్వం దేశమంతా ఒకే పన్ను విధానాన్ని అవలంభించాలని తీసుకున్న సంచలనాత్మక నిర్ణయం దేశాన్ని అభివృద్ధి పథం వైపు నడిపిస్తుందా..? భారత్ భవిష్యత్తులో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించనుందా..? అంటే అవుననే అంటున్నాయి నివేదికలు. రాబోయే 10 ఏళ్లలో జపాన్, జర్మనీలను అధిగమించి ప్రపంచంలో మూడో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరిస్తుందని బ్రిటీషు బ్రోకరేజీ సంస్థ హెచ్ఎస్ బీసీ అంచనా వేసింది. సంస్కరణలు స్థిరంగా కొనసాగి, సామజిక పథకాల పై అధిక దృష్టి సాధిస్తే 2028 నాటికి భారత్ మూడో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని ఈ నివేదిక పేర్కొంది. ఈ లక్ష్యాన్ని చేరుకోవాలంటే కొన్ని నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని సూచించింది. రాజకీయ స్థిరత్వం సామాజిక పథకాలపై పెట్టుబడులు పెట్టడం, విద్య, ఆరోగ్య సంరక్షణ చర్యలు లాంటివి చేపట్టడం వల్ల భారత్ తిరుగులేని ఆర్థిక శక్తిగా తన స్థానాన్ని నిలుపుకుంటుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది ఈ నివేదిక. వ్యాపార నిర్వహణను సులభతరం చేయడం, కాంట్రాక్టుల మంజూరు విధానాలను పారదర్శకంగా తీర్చి దిద్దడం ఎంతో చేయాల్సి ఉందని వివరించింది. తప్పుడు సంస్కరణలు కనుక చేపడితే, అది దేశానికి చేటు చేస్తుందని స్పష్టం చేసింది.